ఆ డైరెక్టర్ వెన‌క‌ ఎంతమంది ప‌డ‌తారు నాయనా...!

Update: 2020-08-26 01:30 GMT
'కేజీఎఫ్‌' సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. సౌత్ ఇండస్ట్రీ నుండి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన సినిమాల్లో ''కేజీఎఫ్‌'' ఒకటిగా నిలిచింది. హీరోయిజమ్ చూపించడంలో.. హీరో ఎలివేషన్ సీన్స్ తెరకెక్కించడంలో ప్రశాంత్ కి సాటిలేరని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా మాస్ ప్రేక్షకులను ఎలా కట్టిపడేయాలన్న కిటుకు మాత్రం తెలుసని మాత్రం ప్రూవ్ చేసుకున్నాడు. అయితే 'కేజీఎఫ్' తరువాత‌ క‌న్న‌డ హీరోలు ప్ర‌శాంత్ నీల్ వెన‌కాల ప‌డుతున్నారో లేదో తెలియ‌దు కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ప్ర‌శాంత్ తో సినిమా చేయడానికి తెగ ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.

కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. అయితే తన తదుపరి సినిమా తెలుగులోనే ఉండబోతోందని.. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రశాంత్ తో ఒప్పందం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్ర‌శాంత్ నీల్ ఓ సినిమా చేయబోతున్నాడ‌ని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా కంటే ముందే డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌శాంత్ ఓ స్టోరీ చెప్పాడ‌ని.. అప్ప‌ట్లో ఆగిపోయిన ప్రాజెక్ట్ ఇప్పుడు మ‌ళ్లీ మొదలుకానుందని మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు ఇప్పుడు లేటెస్టుగా రామ్ చ‌ర‌ణ్ ఆ లిస్ట్ లో చేరిపోయాడు.

ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' 'ఆచార్య' సినిమాల్లో నటిస్తున్న రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా 'కేజీఎఫ్' డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడ‌నే టాక్ ఫిలిం సర్కిల్స్ లో మొద‌లైంది. ఎన్టీఆర్ - ప్రభాస్ - రామ్ చరణ్.. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్రశాంత్ నీల్ తో అనేలా వార్తలు వస్తున్నాయి. తెలుగు హీరోలందరూ మన దర్శకులని వదిలేసి కన్నడ డైరెక్టర్ వెనుక ఎందుకు పడుతున్నారో తెలియదు కానీ.. ప్రశాం నీల్ ఒకేసారి ఎంతమంది హీరోలతో సినిమాలు తీస్తాడు అని సినీ అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా 'కేజీఎఫ్ 2' రిలీజ్ అయితే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News