కమల్ చేయలేని క్యారెక్టర్..కొంచెం ఓవర్ అయిందేమో!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడీ చక్రవర్తి విశ్వనటుడు కమల్ హాసన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.;
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన సెటైరికల్ కామెడీ ఎంటర్‌టైనర్ `గాయపడ్డ సింహం`. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించారు. సినిమా రిలీజ్ నేపథ్యంలో టీమ్ హైదరాబాద్‌లో ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడీ చక్రవర్తి విశ్వనటుడు కమల్ హాసన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కమల్ హాసన్ నటకు ఓ యూనివర్శిటీ లాంటి వ్యక్తి.
నటనలో ఆయనకు పోటీ ఎవరూ లేరు రారు కూడా అని అందరికి తెలుసు. అలాంటి లెజెండ్‌తో జేడీ తనని పోల్చుకుంటూ వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ`నటులందరికీ కమల్ హాసన్ నటనే బెంచ్ మార్క్.ఆయన చేసినన్ని పాత్రలు ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు చేయలేదు. ఇకపై కూడా ఆయన్ని బీట్ చేయడం కష్టమే. ఒక నటుడిగా నేను ఆయనకు ఏ విషయంలోనూ సరితూగను. ఆయనకు రాని అదృష్టం నాకు ఈ సినిమా రూపంలో దక్కింది.
ఇందులో నాది అంత గొప్ప పాత్ర. చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు కూడా కమల్ హాసన్ చేయనటువంటి పాత్ర ఇది. కెరీర్‌లో చాలా మందికి జయాపజయాలు ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర ఒకటి ఉంటుంది. నాకు `మనీ`, అనగనగ ఒక రోజు` ఇప్పటికీ ప్రత్యేకమే. మళ్లీ చాలా ఏళ్ల తరువాత ఆ సినిమాల్లో పోషించిన లాంటి పాత్ర వచ్చింది` అన్నారు. కమల్‌తో నటుడిగా నేను ఏ విషయంలోనూ సరితూగను అని చెబుతూనే కమల్‌తో తనని తాను పోల్చుకోవడం కొంత ఓవర్‌గా అనిపిస్తోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
నేను కమల్ అంతటి నటిడ్ని అని ఎవరు చెప్పినా అది అపహాస్యమే అవుతుంది. ఎందుకంటే నటనకు కమల్ ఓ డిక్షనరీ. అలాంటి నటుడితో పోల్చుకునే సాహసం ఇన్నేళ్లుగా ఎవరూ చేయలేదంటే ఆయన దరిదాపుల్లోకి కూడా తాము వెళ్లలేమని, ఆయన చేసినన్ని ప్రమోగాలు, ప్రయోగాత్మక పాత్రలు, చిత్రాలు తాము చేయలేమని అంతా ఒప్పుకున్నారు కాబట్టే కమల్‌తో ఎవరూ పోల్చుకోలేదు. కానీ అలాంటి కమల్ హాసన్ తో జేడీ తనని తాను పోల్చుకోవడం విడ్డూరమే.
అంతే కాకుండా తనకు దక్కని అదృష్టం నాకు దక్కిందని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉందని నెటిజన్‌లు కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు. జేడీ మంచి నటుడే అందులో ఎలాంటి సందేహం లేదు. `సత్య` లాంటి సినిమాల్లో జేడీ నటన ఓ లెవెల్లో ఉంటుంది. దీన్ని ఎవరూ కాదనలేని సత్యం. కానీ కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో తనని పోల్చుకుంటూ స్టేట్మెంట్‌లు ఇవ్వడమే కాస్త ఓవర్ అయిందనే కామెంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి.