గాయపడ్డ సింహం.. JD టాటూ వెనుక అంత కథ ఉందా?
టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం గాయపడ్డ సింహం విడుదలకు సిద్ధమవుతోంది.;
టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం గాయపడ్డ సింహం విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రమోషన్స్ లో భాగంగా మూవీ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ సమయంలో సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి.
గాయపడ్డ సింహం చిత్రంలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన తన పాత్ర గురించి మాట్లాడుతుండగా.. టాటూ గురించి చెప్పబోతూ మర్చిపోయారు. దీంతో హోస్ట్ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అడిగారు. అందుకు జేడీ సరదాగా స్పందిస్తూ, 'నిన్ను చూసినప్పుడు అన్నీ మర్చిపోయా' అని చెప్పడంతో అక్కడ అంతా నవ్వుకున్నారు.
ఇంతలో హోస్ట్ టాటూ గురించి అడగడానికి ఆయన చేయి పట్టుకోవడంతో.. ట్రోలింగ్ చేయొద్దు అంటూ జేడీ చక్రవర్తి చమత్కరించారు. తర్వాత హోస్ట్ ఆయన చేతిపై ఉన్న టాటూలో డాడ్ అని ఉండడం గమనించి, కాస్త దూరంగా ఉండటం మంచిదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆ ఫన్నీ కన్వర్జేషన్ అందరినీ ఎట్రాక్ట్ చేసింది.
అనంతరం జేడీ చక్రవర్తి తన టాటూ వెనుక ఉన్న కథను వివరించారు. "డైరెక్టర్ కశ్యప్ చెప్పినట్టు, గాయపడ్డ సింహం సినిమాకు, నా టాటూకు ఓ కనెక్షన్ ఉంది. నిజంగా ఆ టాటూ ఆధారంగా పార్ట్ 1 సినిమా కూడా తీసేయొచ్చు. నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నా" అని అన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని, తన పాత్ర మాత్రం చాలా విచిత్రంగా ఉంటుందని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, "సినిమా సెట్స్‌కు వెళ్లగానే నా ఫోటోకి దండ వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అది మనసులోని కోరికేనా? లేక అలా అయితే బాగుంటుందా? అని నేను కన్ఫ్యూజన్ అయ్యాను. కానీ ఆ విషయానికి దర్శకుడు కశ్యప్ మంచి కథ చెప్పారు. అలా నా ఫోటో, టాటూ, దండకు సంబంధం ఉంది" అని వెల్లడించారు. అయితే ఆ కథ ఏమిటో మాత్రం ఆయన స్పష్టంగా చెప్పకుండా సస్పెన్స్ కొనసాగించారు.
అదే సమయంలో తన కెరీర్ గురించి కూడా జేడీ చక్రవర్తి మాట్లాడారు. "ప్రతి నటుడి కెరీర్‌లో విజయాలు, అపజయాలు సహజం. కానీ గుర్తుండిపోయే పాత్రలు కొన్ని ఉంటాయి. నాకు మనీ, అనగనగా ఒక రోజు సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకం. చాలా ఏళ్ల తర్వాత అలాంటి గుర్తుండిపోయే పాత్ర గాయపడ్డ సింహంలో వచ్చింది” అని తెలిపారు. సినిమాలో పలువురు దర్శకులు నటించారని, ఇది డైరెక్టర్ల మూవీ అని ఆయన వ్యాఖ్యానించారు. కంటెంట్ కు ప్రాధాన్యం ఇచ్చిన ఆ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం జేడీ చక్రవర్తి చెప్పిన టాటూ కథ, సినిమాలోని సస్పెన్స్ అంశాలు మాత్రం మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.