ముందు ప్రొడ్యూసర్.. ఇప్పుడు డైరెక్టర్.. మరి హీరోయిన్?
ముఖ్యంగా సినిమాలోని కంటెంట్, టేకింగ్, ప్రెజెంటేషన్ కు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.;
సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఎవరు వైరల్ అవుతారు, ఎవరిపై ఒక్కసారిగా అందరి దృష్టి పడుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. తాజాగా విడుదలైన రాకాస మూవీ ఆ విషయానికి పక్కా ఉదాహరణగా నిలుస్తోంది. విడుదలకు ముందు వరకు సినిమాకు నిర్మాతగా ఉన్న మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఎక్కువగా వినిపించగా, రిలీజ్ అయిన తర్వాత మాత్రం దర్శకురాలు మానస శర్మ పేరు హైలైట్ అవుతూ ట్రెండ్ అవుతోంది.
గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాకాస చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రాకపోయినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో మంచి రన్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా సినిమాలోని కంటెంట్, టేకింగ్, ప్రెజెంటేషన్ కు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
సినిమాలో యంగ్ డైరెక్టర్ మానస శర్మ తన ప్రత్యేక శైలిని చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె దర్శకత్వం మాత్రమే కాకుండా.. మాట తీరు, అమాయకత్వం, వ్యక్తిత్వం సోషల్ మీడియాలో నెటిజన్లను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి. చాలా మంది ఆమెను హీరోయిన్ గా కూడా ప్రయత్నించమని సలహాలు ఇస్తుండటం విశేషం. ప్రస్తుతం మానస శర్మ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
మరోవైపు సినిమాలో హీరోయిన్ గా నటించిన నయన్ సారిక కూడా మంచి నటనతో ఆకట్టుకుంది. తన పాత్రకు తగ్గట్టు చక్కగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కానీ సోషల్ మీడియా ఫోకస్ మాత్రం ఆమెపై అంతగా పడకపోవడం గమనార్హం. ప్రమోషన్స్ సమయంలో నిహారిక కొణిదెల ఎక్కువగా హైలైట్ కాగా, ఇప్పుడు సినిమా విడుదల తర్వాత మానస శర్మనే అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు.
అయితే దర్శకురాలు మానస శర్మ ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె తన కెరీర్ ను యూట్యూబ్ తో ప్రారంభించారు.. 2019లో నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థలో వచ్చిన మ్యాడ్ హౌస్ సిరీస్ కు రచయితగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ కు క్రియేటర్ గా, రచయితగా వ్యవహరించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసింది.
ఇటీవల సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అయిన బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ తో దర్శకురాలిగా మారిన మానస శర్మ, ఆ ప్రాజెక్ట్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసులతో ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు రాకాసతో వెండితెరపై అడుగుపెట్టి మరో మెట్టు ఎక్కారు. మొత్తానికి సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు వెలుగులోకి వస్తారో చెప్పడం కష్టమే. రాకాస సినిమా విషయంలో దర్శకురాలు మానస శర్మకు వచ్చిన ఆ అటెన్షన్ దానికి నిదర్శనంగా నిలుస్తోంది.