నెల తిరక్కుండానే పెద్దన్న వచ్చేస్తున్నాడు

Update: 2021-11-22 16:30 GMT
ఈమద్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు చాలా తక్కువ సమయంలోనే వస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్న 50 రోజుల నిబంధన కొన్ని సినిమాల విషయంలో తొలగించారు. ఇక కొందరు తమ సినిమాలను థియేటర్‌ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ కు ఇస్తుంటే మరి కొందరు నెల రోజులు మరి కొందరు అయిదు వారాల ఒప్పందం చొప్పున ఇస్తున్నారు. నెల లోపే ఓటీటీ స్ట్రీమింగ్‌ అనేది చాలా తక్కువ జరుగుతుంది. కాని సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ అన్నాత్తే సినిమా మాత్రం చాలా తక్కువ సమయంలోనే స్ట్రీమింగ్‌ కు సిద్దం అవుతోంది. నెల కూడా తిరక్కుండానే అన్నాత్తే ను స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్దం అయ్యారనే వార్తలు వస్తున్నాయి.

తెలుగు లో పెద్దన్నగా విడుదల అయిన అన్నాత్తేను కేవలం మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సిద్దం చేయడం జరిగింది. పెద్దన్న అత్యంత దారుణమైన ప్లాప్‌ గా తెలుగు రాష్ట్రాల్లో నిలిచింది. తమిళ వర్షన్‌ వసూళ్లు బాగానే ఉన్నా తెలుగు వర్షన్‌ వసూళ్ల విషయంలో మరీ దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఉంటుందని అస్సలు ఊహించలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. పెద్దన్న సినిమా బయ్యర్లకు రక్త కన్నీరు మిగిల్చింది. రజినీకాంత్ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అయినా కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయితే చూసేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.

అందుకే సినిమా వేడి తగ్గకుండానే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించేశారు. నవంబర్‌ 26వ తేదీన సన్‌ నెక్ట్స్‌ లో స్ట్రీమింగ్ కు పెద్దన్న సిద్దం అయ్యాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మించారు కనుక సహజంగానే ఈ సినిమా సన్ నెక్ట్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇక పెద్దన్న సినిమా విషయానికి వస్తే రజినీకాంత్ కు జోడీగా నయనతార నటించగా చెల్లి పాత్రలో కీర్తి సురేష్‌ నటించింది. మీనా మరియు ఖుష్బులు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. అన్నాత్తే తెలుగు ప్రేక్షకులు పాత చింతకాయ పచ్చడి అంటూ పక్కకు పెట్టారు. ఇలాంటి కాన్సెప్ట్ కథలు తెలుగు లో చాలా ఏళ్ల క్రితం వచ్చాయి. కనుక జనాలు ఇక్కడ పెద్దగా కలెక్షన్స్ ఇవ్వలేదు. కాని తమిళంలో వంద కోట్లకు మించి వసూళ్లను దక్కించుకున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News