టాప్ స్టోరి: ఈసారి 'ప‌ద్మ‌శ్రీ‌' ఎవ‌రికి?

Update: 2019-08-03 14:46 GMT
ప‌ద్మ పుర‌స్కారాలు ప్ర‌తియేటా ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వివిధ రంగాల్లో ప్ర‌ముఖుల స్థాయి.. వారి సేవ‌ల ఆధారంగా ఈ పుర‌స్కారాల్ని కేంద్రం ప్ర‌క‌టిస్తోంది. ఈ తొమ్మిదేళ్ల‌ కాలంలో (2010- 19) కాలంలో ఎంద‌రో సినీప్ర‌ముఖుల్ని ప‌ద్మ అవార్డులు వ‌రించాయి. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు పుర‌స్కారాలు ద‌క్కాయి. 2019 మార్చిలో ఇప్ప‌టికే ప‌ద్మాలు (ప‌ద్మ‌శ్రీ‌- ప‌ద్మ‌భూష‌ణ్‌- ప‌ద్మ‌విభూష‌ణ్‌) ప్ర‌క‌టించారు. ఈపాటికే 2020 ప‌ద్మ పుర‌స్కారాల కోసం ప్ర‌ముఖుల పేర్ల‌ను నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని తెలుస్తోంది.

ఈసారి పుర‌స్కారాలు ద‌క్కేది ఎవ‌రికి?  తెలుగు సినీప‌రిశ్ర‌మ నుంచి అందుకు అర్హులైన వారు ఎంద‌రున్నారు? అన్న‌ది ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి. ఈసారి `పద్మశ్రీ` రేసులో సౌత్ నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు ఉన్నార‌ని తెలుస్తోంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్- ప్ర‌సాద్ ల్యాబ్స్ అధినేత ర‌మేష్ ప్ర‌సాద్ పేరుతో పాటు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు పేరు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌తిసారీ ఐదుగురి పేర్ల‌ను పంపించేవారు. కానీ ఈసారి కేవ‌లం ఇద్ద‌రి పేర్ల‌నే ఛాంబ‌ర్ వ‌ర్గాలు పంపించాయ‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఆ ఇద్ద‌రి పేర్ల‌నే `ప‌ద్మ‌శ్రీ`కి ఎంపిక చేయ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. తెలుగు సినీప‌రిశ్ర‌మ మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ కి త‌ర‌లి రావ‌డంలో.. ఇక్క‌డ‌ ప‌రిశ్ర‌మ పాదుకొన‌డంలో ఎల్వీ ప్ర‌సాద్- ర‌మేష్ ప్ర‌సాద్ కృషి మ‌ర్చిపోలేనిది. ప్ర‌సాద్ ల్యాబ్స్ ద్వారా ర‌మేష్ ప్ర‌సాద్ సినిమాకి చేసిన సేవ‌లు అన‌న్య సామాన్యం. అలానే  ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇనిస్టిట్యూట్ - ఆస్ప‌త్రి ద్వారా ఆయ‌న‌ చేస్తున్న సేవ‌లకు ఎంతో గుర్తింపు ఉంది. అందుకే ఈసారి ఆ పేరును ప‌రిశీలించార‌ట‌. అలాగే ద‌శాబ్ధాల పాటు సీనియ‌ర్ ద‌ర్శ‌కులుగా కె.రాఘ‌వేంద్ర‌రావు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని రూపొందించారు. తెలుగు ప్రేక్ష‌కులకు త‌న‌దైన వినోదాన్ని అందించిన గొప్ప ద‌ర్శ‌కులుగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న సీనియారిటీని గౌర‌విస్తూ ఈసారి ప‌ద్మశ్రీ కేట‌గిరీకి ప్ర‌తిపాదించార‌ట‌. ఆ రెండు పేర్ల‌ను పంపించ‌డం స‌ముచితం అన్న చ‌ర్చా ఛాంబ‌ర్ వ‌ర్గాల్లో వినిపించింది.
Tags:    

Similar News