'వకీల్ సాబ్'కి వంద మార్కులు పడిపోతాయట!

Update: 2021-04-08 10:30 GMT
పవన్ కల్యాణ్ చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా కావడంతో, ఆయన అభిమానులంతా 'వకీల్ సాబ్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. హిందీలో హిట్ కొట్టిన 'పింక్' సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ రేపు అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. నివేదా థామస్ .. అంజలి ... అనన్య ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, శ్రుతి హాసన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'దిల్' రాజు నిర్మాతగా వ్యవహరించాడు.

హిందీ మూవీ 'పింక్'లో అమితాబ్ పాత్ర గెస్ట్ రోల్ మాదిరిగా ఉంటుంది. కీలకమైనదే అయినా ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. అక్కడ ఈ కథ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా 'నెర్కొండ పారవై' టైటిల్ తో రీమేక్ చేశారు. తమిళంలో అజిత్ కి గల క్రేజ్ కి తగినట్టుగానే ఆయన పాత్రకి కాస్త హీరోయిజాన్ని జోడించారు. అదే సినిమాను తెలుగులోకి రీమేక్ చేయవలసి వచ్చేసరికి, పవన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పాత్ర పరిధిని పెంచి .. ఆయన స్టార్ డమ్ కి తగినట్టుగా మార్చారు.

ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో 'దిల్'రాజు మాట్లాడుతూ .. " హిందీలో 'పింక్' సినిమా కంటే తమిళంలో 'నెర్కొండ పారవై' బాగా ఆడింది. అలాగే తమిళంలో ఆ సినిమా కంటే తెలుగులో 'వకీల్ సాబ్' మరింత బాగా ఆడుతుందని అన్నారు. మూలకథ చెడకుండగా నేటివిటీనీ .. హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చేయడమే అందుకు కారణమని చెప్పారు. హిందీలో 'పింక్' మూవీ 50 మార్కులు తెచ్చుకుంటే, 'నెర్కొండ పారవై' సినిమాకి 75 మార్కులు వచ్చాయని అన్నారు. 'వకీల్ సాబ్'కి మాత్రం ప్రేక్షకులు నూటికి నూరు మార్కులు ఇచ్చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.     
Tags:    

Similar News