యంగ్ టైగ‌ర్ సోలోగా ఎప్పుడోస్తారో?

Update: 2021-09-09 01:30 GMT
పాన్ ఇండియా వార్ ప‌రాకాష్ట‌కు చేరుకున్న ఈ స‌మ‌యంలో ప్ర‌భాస్ కి ధీటుగా ఎదిగేందుకు సాటి స్టార్ హీరోల ప్ర‌య‌త్నం తెలిసిందే. ముఖ్యంగా తార‌క్.. చ‌ర‌ణ్ స్నేహితులు ఎవ‌రికి వారు తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో రేసులో దూసుకెళుతున్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా మూవీ `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ లో ఉండాగానే చ‌ర‌ణ్ `ఆచార్య‌`లో న‌టించారు. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ శంక‌ర్ తో ఆర్.సి 15 సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ చిత్రం నేడు హైద‌రాబాద్ లో ప్రారంభ‌మ‌వుతోంది. చ‌ర‌ణ్ ఇలా ప‌క్కా ప్లాన్ తో ముందుకు సాగిపోతున్నారు. ముందుగా `ఆచార్య‌` ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఆచార్య లో కీల‌క పాత్ర అయినా.. క‌నిపించిన కాసేపు మెగా ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కి పున‌కాలే. ఆ త‌ర్వాత `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ అవుతుంది. అటుపై శంక‌ర్ చిత్రం కూడా వ‌చ్చేస్తుంది .

ఇలా మూడు సినిమాల‌తో పెద్ద గ్యాప్ లేకుండా వెంట వెంట‌నే అభిమానుల్ని అల‌రించ‌నున్నారు. అయితే తార‌క్ మాత్రం సోలోగా బాక్సాఫీస్ ముందుకు రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అత‌డు బ్యాక్ టు బ్యాక్ ద‌ర్శ‌కుల్ని లాక్ చేసి కూడా ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. `ఆర్.ఆర్.ఆర్` త‌ర్వాత తార‌క్ బుల్లితెర‌పై `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు` (ఇఎంకే) షూట్ లో బిజీ అయ్యారు. కొర‌టాల శివ‌తో క‌మిట్ మెంట్ ఉన్నా ఆ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ కు తీసుకెళ్తారో క్లారిటీ లేదు. ఈ ఏడాదిలో అయితే కొర‌టాల చిత్రాన్ని ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపించ‌లేదు. దానికి తోడు క‌రోనా వేవ్ లు ఉన్నాయి కాబ‌ట్టి ఆ కార‌ణంగాను మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు.

ఎలా చూసినా కొర‌టాల తార‌క్ తో సినిమా ప్రారంభించి రిలీజ్ చేయాలంటే 2023 వ‌చ్చేస్తుంద‌ని ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. అప్ప‌టివ‌ర‌కూ తార‌క్ ని అభిమానులు సోలో హీరోగా చూడ‌కుండా ఉండ‌గ‌ల‌రా? అన్న సందేహాలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి తార‌క్ అభిమానుల సందేహాల్ని నిజం చేస్తారా? లేక వాటికి ఆస్కారం లేకుండా వ‌రుస‌ కమిట్ మెంట్లతో జోరు పెంచుతారా? అన్న‌ది చూడాలి. చెర్రీ శంక‌ర్ తో ప్లాన్ చేసిన‌ట్టే .. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో తార‌క్ భారీ పాన్ ఇండియా సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మైత్రి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. వైజ‌యంతి బ్యాన‌ర్ కి కూడా తార‌క్ క‌మిట్ మెంట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రానికి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంది.

జన‌తా గ్యారేజ్ సీక్వెలే అంటూ..!

తార‌క్ `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు` షోతో బిజీగా ఉండ‌గా.. తార‌క్ కొత్త లుక్ ఒక‌టి ఇటీవ‌ల‌ లీకైంది. ఇందులో తార‌క్ `జ‌న‌తా గ్యారేజ్` ..`బృందావ‌నం` త‌ర‌హా లుక్ లో సాప్ట్ గా క‌నిపించారు. దీంతో అభిమానుల్లో సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. తార‌క్ ఇంత సాప్ట్ గా క‌నిపిస్తున్నాడు ఏంటి ? అని గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌తా గ్యారేజ్ పాయింట్ కి ముడిపెట్టి మాట్లాడుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొర‌టాల‌తో `జ‌న‌తా గ్యారేజ్ ` సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారా? అంటూ గుస‌గుస మొద‌లైంది.

కొర‌టాల హీరోల్ని ఆన్ స్క్రీన్ పై ఎంత అందంగా చూపిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌తో ప‌నిచేసిన హీరోలు తెర‌ పై స్మార్ట్ లుక్ లో కనిపిస్తారు. కొర‌టాల వ‌ద్ద హీరోల్ని అలా డిజైన్ చేసే డిజైన‌ర్లు ఉంటారు. ఎలాంటి మాస్ పాత్ర‌లోనైనా హీరోని స్మార్ట్ గా చూపించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. తాజా రూమ‌ర్ ఎంత వ‌ర‌కూ నిజ‌మో వేచి చూడాలి. కొర‌టాల సీక్వెల్ క‌థ‌ల మూడ్ లో ఉన్నారా.. లేక ఒరిజిల్ క‌థ‌ల‌తో కొత్త వాటితోనే ముందుకు వెళుతున్నారా? అన్న‌ది కూడా వేచి చూడాలి.




Tags:    

Similar News