ద్విపాత్రాభినయం చేస్తున్న యువ హీరో..?

Update: 2020-12-26 23:30 GMT
'అర్జున్ సురవరం' సినిమా సక్సెస్ తో జోష్ లో ఉన్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '18 పేజెస్' సినిమా ఒకటి. నిఖిల్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే ను అందిస్తుండటం విశేషం. సుకుమార్ భాగస్వామి కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. డిఫరెంట్ స్టోరీలతో విలక్షణమైన పాత్రలను క్రియేట్ చేసే సుక్కు ఈ సినిమాలో నిఖిల్ కోసం అలాంటి పాత్రనే సృష్టించాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో నిఖిల్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అంతేకాదు అందులో ఒక పాత్ర జ్ఞాపకశక్తి కోల్పోయే నేపథ్యంలో సాగుతుందని కూడా అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇదిలావుండగా నిఖిల్ తన హిట్ సినిమా 'కార్తికేయ' కి సీక్వెల్ గా 'కార్తికేయ 2' చిత్రంలో నటించనున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ నిర్మిస్తున్నారు. అలానే నిఖిల్ కెరీర్లో 20వ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ తో కలసి చేయనున్నాడు.
Tags:    

Similar News