మేం సినిమాలు చేస్తే ఎవరు చూస్తారండి?

Update: 2018-09-25 07:10 GMT
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక వైపు బయోపిక్‌ ల జోరు కొనసాగుతుంటే మరో వైపు మల్టీస్టారర్‌ ల హవా కూడా కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్‌ చిత్రాలు ఈమద్య కాస్త ఎక్కువ వస్తున్నాయి. 1980 మరియు 90లలో అప్పట్లో ప్రేక్షకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ లో ఏ ఇద్దరు అయినా కలిసి నటిస్తే చూడాలని కోరుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి బాలకృష్ణ లేదా నాగార్జున, వెంకటేష్‌లు కలిసి నటించాలని వారి వారి అభిమానులు అనుకున్నారు. కాని అప్పట్లో పరిస్థితుల కారణంగా మల్టీస్టారర్‌ లు సాధ్యం కాలేదు.

ప్రస్తుతం ఆ సీనియర్‌ హీరోలు జూనియర్‌ హీరోలతో, జూనియర్‌ స్టార్‌ హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా నానితో కలిసి నాగార్జున  ‘దేవదాస్‌’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ మల్టీస్టారర్‌ చిత్రాలపై తన అభిప్రాయంను ముక్తసరిగా చెప్పేశాడు.

నాగ్‌ మాట్లాడుతూ.. ఒక వైపు సోలో హీరోగా చేస్తూనే మరో వైపు మల్టీస్టారర్‌ చిత్రాలను చేస్తాను. సీనియర్‌ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రం చేసే ఆలోచన లేదు అంటూ తేల్చి చెప్పేశాడు. ఒక వేళ సీనియర్‌ హీరోతో అంటే చిరంజీవి, వెంకటేష్‌ వంటి హీరోలతో తాను మల్టీస్టారర్‌ చిత్రం చేసినా కూడా ప్రేక్షకులను అలరించడం కష్టం. ముసలి వారి సినిమాలు ఎవరు చూస్తారండి అన్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను వెంకీతో కలిసి ఒక మల్టీస్టారర్‌ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని మేము సినిమా చేస్తే ప్రేక్షకులు ఈ ముసలొళ్ల సినిమా ఏం చూస్తాంరా  బాబు అనుకుంటారంటూ నాగ్‌ ఫన్నీ కామెంట్స్‌ చేశాడు.

సీనియర్‌ హీరోలతో మల్టీస్టారర్‌ చేసే ఆలోచన అస్సలు లేదన్న నాగార్జున తర్వాత చిత్రం విషయంలో నిర్ణయం తీసుకోలేదు అన్నాడు. ప్రస్తుతం కళ్యాణ్‌ కృష్ణ మరియు రాహుల్‌ రవీంద్రన్‌ లు కథలు సిద్దం చేస్తున్నారు. వారిద్దరిలో ఎవరి కథ ముందు రెడీ అయితే ఆ సినిమా తన తదుపరి చిత్రం అవుతుందని నాగార్జున పేర్కొన్నాడు.

Tags:    

Similar News