చై-సామ్ జంటకు ఎక్కడ చెడిందో..?

Update: 2021-10-02 13:30 GMT
అక్కినేని నాగచైతన్య - సమంత వైవాహిక బంధానికి తెరపడింది. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ నాలుగేళ్ళ బంధానికి స్వస్తి పలికారు. ఎంతో ఆలోచించి ఇద్దరు విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ''శ్రేయోభిలాషులందరికీ.. ఇకపై మేము వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలని అనుకుంటున్నాం. భార్య భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఈ కష్ట సమయంలో మద్దతు కావాలని.. మా ప్రైవసీ ని కాపాడాలని అభిమానులు శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాము'' అని చైతన్య - సమంత విడివిడిగా ప్రకటించారు.

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'ఏమాయ చేసావే' సినిమాలో జంటగా నటించిన చైతూ - సమంత.. 2017 అక్టోబర్ 7న ప్రేమ పెళ్లి చేసుకుని రియల్ లైఫ్ లో ఒకటయ్యారు. మరో వారం రోజుల్లో వివాహ బంధానికి నాలుగేళ్లు పూర్తవుతాయి అనుకుంటుండగా.. ఇప్పుడు విడాకుల ప్రకటన ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఎక్కడ విబేధాలు వచ్చాయని.. ఇద్దరిలో ఎవరి సైడ్ మిస్టేక్ ఉందని.. విడాకులు తీసుకునేంత సమస్య ఏమై ఉంటుందని అభిమానులు ఆలోచిస్తున్నారు.

నిజానికి సామ్ - చైతన్య దూరంగా ఉంటున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియా మాధ్యమాల్లో 'అక్కినేని' పేరుని తొలగించడంతో ఈ చర్చ మొదలైంది. అప్పటి నుంచి నాగ చైతన్య కు సంబంధించిన విషయాలను సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం.. చైతూ లేకుండానే సమంత గోవా ట్రిప్‌ కు వెళ్లడం వంటివి అందరిలో ఉన్న అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలో చై సామ్ జంట విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. అక్కినేని ఫ్యామిలీ సైతం దీనిపై సైలెంట్ గానే ఉంటూ వచ్చింది.

అయితే 'లవ్ స్టోరీ' ట్రైలర్ పై సమంత స్పందించడం.. చైతన్య రిప్లై ఇవ్వడం.. అక్కినేని నాగార్జున పుట్టినరోజు నాడు 'మామ' అని సంభోదిస్తూ సామ్ శుభాకాంక్షలు చెప్పడం వంటివి వీరు విడిపోవడం లేదు అని అభిమానులు అనుకునేలా చేశాయి. ఏదేమైనా వీరి యానివర్సరీ అక్టోబర్ 7న దీనిపై క్లారిటీ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆలోపే ఇద్దరూ వేరు కుంపటి పెడుతున్నట్లు ప్రకటించారు. నాగ చైతన్య - సమంత నిర్ణయం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. తమ గోప్యతను కాపాడాలని చై సామ్ కోరినా.. ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకున్న తమ అభిమాన జంట ఇలా విడిపోవడంతో ఫ్యాన్స్ దీని గురించి డిస్కష్ చేయకుండా ఉండలేకపోతున్నారు.


Tags:    

Similar News