అత్యాచారాలు, హత్యలు కనిపించడం లేదా.. కుక్కలనే ఎందుకు చంపేస్తున్నారు - రేణుదేశాయ్

గత ఏడాది కాలంలో ఎక్కువ మరణాలు వీధి కుక్కల దాడుల్లోనే జరుగుతున్నాయనే వార్త దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.;

Update: 2026-01-19 12:37 GMT

గత ఏడాది కాలంలో ఎక్కువ మరణాలు వీధి కుక్కల దాడుల్లోనే జరుగుతున్నాయనే వార్త దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా చిన్న గ్రామం మొదలుకొని పెద్దపెద్ద పట్టణాల్లో కూడా ఈ వీధి కుక్కల దాడులు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ వీధి కుక్కల బెడదపై ఏకంగా సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ప్రజల భద్రత అలాగే జంతు ప్రేమికుల భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ తీర్పులు ఇస్తోంది.

అంతేకాదు పాఠశాలలు, ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల నుండి వీధి కుక్కలను వెంటనే తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతేకాదు ఎవరైతే వీధి కుక్కలకు అన్నం పెడుతున్నారో.. ఆ కుక్కలు ఇతరులపై దాడి చేసి చంపేస్తే.. ఆ బాధ్యత అన్నం పెట్టిన వారితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా ఒకవైపు ఈ వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంటే .. మరొకవైపు ఈ వీధి కుక్కలపై దాడులు చేస్తూ వాటిని చంపేయడం జంతు ప్రేమికులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీధి కుక్కలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో జంతు ప్రేమికురాలిగా పేరు సొంతం చేసుకున్న రేణు దేశాయ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాదు ఈ కుక్కలపై దాడులు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రెస్ మీట్ లో భాగంగా రేణూ దేశాయ్ మాట్లాడుతూ.." కుక్కలను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. కుక్కలు అన్ని ప్రమాదకరం కాదు.. ఎక్కడో ఒకటి హాని కలిగించిందని వంద కుక్కలను చంపేస్తున్నారు. అసలు మీకు నిద్ర ఎలా పడుతుంది? కర్మ అనుభవిస్తారు.. హాని కలిగించే కుక్కల గురించి మాకు సమాచారం ఇవ్వండి.. వాటిని మా ఎన్జీవోలకు మేము తరలిస్తాము.

ముఖ్యంగా డెంగీతో పిల్లలు చనిపోతున్నారు. మగాళ్లు అత్యాచారాలు, హత్యలు చేస్తుంటారు. అలాగని మగాళ్ళందర్నీ హంతకులు, రేపిస్టులని చంపేస్తామా? అసలు బుద్ధి ఉందా?" అంటూ ఘాటుగా ప్రశ్నించింది రేణు దేశాయ్. ముఖ్యంగా మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దని.. కొన్ని కుక్కలు నష్టం కలిగించాయని వాటి మొత్తం జాతినే అంతం చేయడం సరికాదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్. ఇక ఇప్పుడు ఈ విషయంపై నేను గొంతు విప్పకపోతే.. ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. ఎవరు ఏమనుకున్నా.. నాపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. నేను మాత్రం ఖచ్చితంగా నా అభిప్రాయాన్ని చెప్పుకుంటాను. ఇక నన్ను బుద్ధిలేనిదని , ఎల్ అనే పదం ఉపయోగించి కూడా నాపై కామెంట్లు చేస్తారు. ఐ డోంట్ కేర్.. ప్రస్తుతం నేను చెప్పాలనుకున్నది కచ్చితంగా చెప్పి తీరుతాను అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా జంతు ప్రేమికురాలు ఈమెకు మద్దతుగా పలుకుతున్నారు.

Tags:    

Similar News