విజయ్‌తో లేడీ డైరెక్టర్..ఎందుకు వర్కవుట్ కాలేదు?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయగన్`. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయగన్`. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. జనవరి 9న సంక్రాంతి బరిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ వివాదం కారణంగా సినిమా రిలీజ్ ఆగిపోవడమే కాకుండా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై ఇంత వరకు క్లారిటీ లేదు. నిర్మాతే స్వయంగా ఈ సినిమా మా పరిధి దాటిపోయిందని చెప్పడంతో `జన నాయగన్` ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో శివ కార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన `పరాశక్తి` జనవరి 10నే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ అభిమానులు ఈ మూవీపై, ఈ మూవీ టీమ్‌పై నెట్టింట దాడి చేశారు. థియేటర్లలోనూ దాడికి పాల్పడటమే కాకుండా దర్శకురాలు సుధా కొంగర, మూవీ టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య వివాదం మొదలైంది. దీనిపై హీరో శివకార్తికేయన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ `జన నాగయన్`తో పాటు హీరో విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్‌కు తాను వీరాభిమానినని చెప్పిన ఆమె `జన నాయగన్` సినిమాకు జరిగినట్లు ఏ సినిమాకూ జరగకూడదన్నారు. `నేను విజయ్‌ని ఆరాధిస్తాను. అతనికున్న వీరాభిమానుల్లో నేను మొదటి వరుసలో ఉంటాను. విజయ్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు` అని చెప్పింది.
ఇక విజయ్ నటించిన `జన నాయగన్` మా `పరాశక్తి`తో పాటు రిలీజ్ కావాల్సింది. మా సినిమా ఆడియో లాంచ్‌లోనూ నేను దీని గురించి మాట్లాడాను. కావాలంటే `పరాశక్తి`ని 200 సార్లు చూస్తాను. కానీ విజయ్ `జన నాయగన్`కు మాత్రం మొదటి రోజే మొదటి షోకు వెళ్తానని స్టేజ్ మీదే చెప్పాను. దాని రిలీజ్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రిలీజ్‌కు కొన్ని గంటల ముందు సెన్సార్ కారణంగా వాయిదా పడింది. అలా ఏ సినిమాకు జరగకూడదు. ఆయన సినిమాతో పోటీపడాలని మేం ఎప్పుడూ అనుకోలేదు.
దేశంలోనే అతిపెద్ద స్టార్‌తో మేం ఎలా పోటీపడతాం. అలా ఎవరూ చేయరు` అని చెప్పుకొచ్చింది. దళపతి విజయ్‌తో సుధా కొంగర సినిమా ఎందుకు మిస్సయింది? ..దాని వెనుక ఏం జరిగింది? ఎందుకు కార్యరూపం దాల్చేలేకపోయింది? అన్నది మాత్రం సుధా కొంగర బయటపెట్టలేదు. ఏవే అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని చెప్పిందే కానీ అసలు కారణం ఏంటన్నది మాత్రం బయటపెట్టకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే `జన నాయగన్` సెన్సార్ వివాదానికి సంబంధించిన విచారణ జనవరి 20న మద్రాస్ హైకోర్టులో జరగనున్న విషయం తెలిసిందే.