టిక్కెట్టు రేటు ప‌రిష్కారంపై సీఎం జ‌గ‌న్ తో మెగాస్టార్ భేటీకి డేట్ ఫిక్స్

Update: 2021-08-14 16:30 GMT
కొన‌సాగుతున్న క‌రోనా క్రైసిస్ ఓవైపు.. ఏపీలో సినిమా టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు మ‌రోవైపు సినీరంగానికి ప్ర‌తిబంధ‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. రెండేళ్లుగా నిర్మాత‌లు ఎగ్జిబిట‌ర్లు పంపిణీ వ‌ర్గాల‌కు కంటిపై కునుకులేదు. సెకండ్ వేవ్ త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌ తిరిగి సాధార‌ణ ప‌రిస్థితి ఎప్ప‌టికి వ‌స్తుందో ఆగమ్య‌గోచ‌రంగా మారింది. క‌రోనా వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైనా ఏపీలో టిక్కెట్టు ధ‌ర ఇబ్బందిక‌రంగా మారింది. థియేట‌ర్ల స‌మ‌స్య ఇప్ప‌టికీ ఓ కొలిక్కి రాలేదు.

అయితే ఈ స‌మస్య‌పై సీఎం జ‌గ‌న్ తో భేటీ కోసం సినీపెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నా అపాయింట్ మెంట్ దొర‌క‌డం లేద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. ఎట్ట‌కేల‌కు ఆ అడ్డంకి కూడా తొల‌గిపోయింది. ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్  చిరంజీవి ఫోన్ చేసి సీఎం జ‌గన్ అపాయింట్ మెంట్ సిద్ధంగా ఉంద‌ని వెల్ల‌డించారు. కొంద‌రు సినీపెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి స‌మ‌స్య పై మాట్లాడాల్సిందిగా చిరుని ఆహ్వానించారు. ప్ర‌స్తుతం ఉన్న థియేట‌ర్ల స‌మ‌స్య గురించి .. ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల బ‌తుకు తెరువు స‌హా.. పంపిణీ వ‌ర్గాల వెత‌ల గురించి మాట్లాడే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా టిక్కెట్టు ధ‌ర‌ల స‌మ‌స్య పైనా కీల‌కంగా  ప‌రిష్కారం కోరే వీలుంది. అయితే చిరుతో పాటు కొంద‌రు ముఖ్యులు ఎవ‌రు హాజ‌ర‌వుతారు? అన్న‌ది తెలియాల్సి ఉంది.

మంత్రి పేర్ని నాని గ‌తంలోనూ సినీరంగం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు చొర‌వ తీసుకున్నారు. ఇంత‌కుముందు సీఎంతో భేటీ లో చిరంజీవి- నాగార్జున - రాజ‌మౌళి- సురేష్ బాబు బృందం స‌మ‌స్య‌లు విన్న‌వించేందుకు నాని సాయం చేశారు. ఇప్పుడు కూడా ఆయ‌న చొర‌వ‌తో సీఎం భేటీకి చిరు బృందం సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ భేటీతో స‌మ‌స్య పూర్తిగా ఒక కొలిక్కి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపుతో స‌మ‌స్య ఏమిటో సినీపెద్ద‌లు సీఎంకి చెబుతారు. దీంతో స‌మ‌స్య ప‌రిష్కారానికి మార్గం దొరుకుతుంద‌ని ఇండ‌స్ట్రీ హోప్ తో ఉంది. ఇంత‌కుముందు జ‌రిగిన భేటీకి న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి. ఈసారి ఆయ‌న‌ను కూడా క‌లుపుకుని సీఎంతో భేటీకి వెళ‌తారనే భావిస్తున్నారు. సీఎంతో భేటీకి తేదీని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.
Tags:    

Similar News