పీపుల్ మీడియా.. ప్రభాస్ తో మళ్ళీ సెట్టవ్వాలంటే..

మరోవైపు, పీపుల్ మీడియాకు జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ మరో సినిమా ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.;

Update: 2026-01-24 03:51 GMT

​టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు నిర్మించే బ్యానర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. 'మిరాయ్' సినిమా కంటే ముందే ఈ సంస్థ వరుస ఫ్లాప్స్ తో ఊహించని నష్టాలను చూసింది. ఆ భారీ నష్టాలను 'మిరాయ్' సక్సెస్ కొంతవరకు తగ్గించినప్పటికీ, లేటెస్ట్ సంక్రాంతికి వచ్చిన ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫలితం మళ్ళీ ఇబ్బందుల్లోకి నెట్టినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా దాదాపు మరో రూ. 100 కోట్ల వరకు భారాన్ని మిగిల్చిందని ట్రేడ్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది.

​ప్రస్తుతం ఈ సంస్థ తన ఆశలన్నీ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమాపైనే పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయంతో గతంలో వచ్చిన నష్టాలను కొంతవరకు పూడ్చుకోవాలని పీపుల్ మీడియా భావిస్తోంది. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ సినిమా కావడంతో, 'స్పిరిట్' బిజినెస్ పరంగా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఈ హక్కులను దక్కించుకోవడం ద్వారా ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కుకోవచ్చనేది వారి ప్లాన్ అని ఇండస్ట్రీలో ఒక గట్టి బజ్ వినిపిస్తోంది.

​మరోవైపు, పీపుల్ మీడియాకు జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ మరో సినిమా ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నిజానికి 'ది రాజా సాబ్' ప్రాజెక్ట్ ప్రభాస్ తన వ్యక్తిగత నిర్ణయం ద్వారానే మారుతికి, పీపుల్ మీడియాకు అవకాశం ఇచ్చి చేశారు. కాబట్టి, నష్టపోయిన నిర్మాతలను ఆదుకునే క్రమంలో ప్రభాస్ మరో డేట్ ఇస్తారనే నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే ఆ సినిమా పట్టాలెక్కడానికి 2028 వరకు సమయం పట్టవచ్చు.

​ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తుంటే ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. హను రాఘవపూడితో 'ఫౌజీ', సందీప్ వంగాతో 'స్పిరిట్', ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్.. ఇలా ఒకదాని వెనుక ఒకటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే పీపుల్ మీడియాకు మరో సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈసారి పీపుల్ మీడియా కేవలం కాంబినేషన్ల మీద కాకుండా, మంచి కంటెంట్ ఉన్న కథలను ప్రభాస్ దగ్గరకు తీసుకువెళితేనే లాంగ్ రన్‌లో సక్సెస్ అవుతారని చెప్పవచ్చు.

​కేవలం కమర్షియల్ లెక్కలు లేదా హీరో ఇమేజ్‌ను నమ్ముకోకుండా, కథా బలమున్న సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే పీపుల్ మీడియా మళ్ళీ పాత ఫామ్‌లోకి వస్తుంది. ప్రభాస్ ఇచ్చే డేట్స్ అనేవి ఒక గొప్ప అవకాశం, దాన్ని సరిగ్గా వాడుకుని పక్కా స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్లడం ఇప్పుడు ఆ సంస్థ ముందున్న అతి పెద్ద సవాల్. ఒకవేళ 'స్పిరిట్' హక్కులు క్లిక్కయిన తరువాత ప్రభాస్ ఇచ్చే తదుపరి సినిమా ఆఫర్ నిజమైతే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. అలాగే మిరాయ్ 2ని కూడా వెంటనే పట్టాలెక్కించి క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే వీరి లైనప్ లో మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.

Tags:    

Similar News