అంబ పలికిందంటున్న అనిల్ రావిపూడి
తన కొత్త సినిమా కథ విషయంలో ఆలోచిస్తుంటే.. రెండు రోజుల కిందటే ఒక అదిరిపోయే ఐడియా వచ్చిందని అనిల్ చెప్పాడు.;
అనిల్ రావిపూడి.. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ షాట్ డైరెక్టర్. 11 ఏళ్ల వ్యవధిలో అతను 9 సినిమాలు తీస్తే.. ఎఫ్-3 ఒక్కటే అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. దాన్ని కూడా ఫెయిల్యూర్ అనలేం. యావరేజ్‌గా ఆడింది. మిగతా సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లు, సూపర్ హిట్లే. తాజాగా సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో మెగాస్టార్ చిరంజీవికి మెమొరబుల్ హిట్ ఇవ్వడం.. కలెక్షన్ల రికార్డులను తిరగరాయడంతో అనిల్ పేరు మార్మోగుతోంది.
ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచి అనిల్ తర్వాతి మూవీ ఏదనే చర్చ మొదలైంది. చిరు సినిమా విడుదల తర్వాత ఆ సినిమా ఆసక్తి ఇంకా పెరిగింది. ఐతే అనిల్ ఇంకా ఆ ఉత్కంఠకు తెరదించలేదు. తన కొత్త చిత్రానికి ఇంకా హీరో ఎవరో ఫిక్స్ కాలేదనే చెబుతున్నాడు. ఐతే కొన్ని రోజుల ముందు వరకు కథ కూడా ఏమీ అనుకోలేదు. కానీ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుకు అదిరిపోయే ఐడియా వచ్చేసిందని అంటున్నాడు అనిల్.
తన కొత్త సినిమా కథ విషయంలో ఆలోచిస్తుంటే.. రెండు రోజుల కిందటే ఒక అదిరిపోయే ఐడియా వచ్చిందని అనిల్ చెప్పాడు. అంబ పలికింది, సరస్వతీ దేవి కరుణించింది అంటూ తన కొత్త సినిమా స్టోరీ లైన్ గురించి చాలా ఎగ్జైట్ అయ్యాడు అనిల్. ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్సయినట్లు చెప్పాడు. ఆ టైటిల్ చాలా క్రేజీగా ఉంటుందని.. దాని ప్రకటన నుంచే ఈ సినిమా జర్నీ చిత్రంగా ఉంటుందని అనిల్ తెలిపాడు.
ఐతే ఈ సినిమాకు హీరో ఎవరు అన్నది ఇంకా ఏమీ అనుకోలేదన్నాడు. కథ సిద్ధమయ్యాకే దానికి సరిపోయే హీరోను చూసుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నాడు అనిల్. జూన్ జులై నాటికి సినిమా సెట్స్ మీదకి వెళ్లొచ్చని చెప్పిన అనిల్.. మళ్లీ సంక్రాంతికి మీ సినిమా రిలీజ్ ఉంటుందా అని అవునన్నట్లు నవ్వేశాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం ఉందా అని అడిగితే.. తమ కాంబినేషన్ కుదిరితే సంతోషమే అని, కానీ దాని గురించి ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పాడు. మళ్లీ విక్టరీ వెంకటేష్‌తో అనిల్ సినిమా చేస్తాడనే ప్రచారం ఇండస్ట్రీలో నడుస్తోంది. సీనియర్ హీరోల్లో ఇంకా జట్టు కట్టని అక్కినేని నాగార్జునతో అనిల్ సినిమా చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.