మెగా సూపర్ హిట్ కాంబో: చిరంజీవి - అల్లు అరవింద్

Update: 2021-06-12 01:30 GMT
మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న అల్లు రామలింగయ్య అల్లుడనే విషయం తెలిసిందే. అల్లు అరవింద్ చెల్లెలు సురేఖ ను వివాహం చేసుకుని చిరు అల్లు వారి అల్లుడు అయ్యారు. అల్లు రామలింగయ్య స్థాపించిన గీతా ఆర్ట్స్ సంస్థలో మెగా ప్రొడ్యూసర్ అరవింద్ తన బావ చిరంజీవితో అనేక సినిమాలని నిర్మించారు. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ - కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి. కొన్ని యావరేజ్ గా నిలిస్తే మరికొన్ని నిరాశ పరిచాయి.

టాలీవుడ్ మెగా సూపర్ హిట్ కాంబినేషన్ గా చెప్పుకొనే చిరంజీవి - అల్లు అరవింద్ కలసి ఇప్పటి వరకు పదహారు సినిమాలు చేశారు. వీరి కాంబోలో వచ్చిన ఫస్ట్ సినిమా 'శుభలేఖ'. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ మరో నిర్మాత వి.వి.శాస్త్రి తో కలిసి నిర్మించాడు. ఆ తర్వాత 'యమ కింకరుడు' 'హీరో' 'విజేత' 'ఆరాధన' 'పపివాడి ప్రాణం' 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' 'రౌడీ అల్లుడు' 'మెకానిక్ అల్లుడు' 'SP పరశురాం' వంటి సినిమాలు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందాయి.

చిరంజీవి నటించిన ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ మూవీ 'ప్రతిబంధ్' కూడా అల్లు అరవింద్ నిర్మాణంలోనే రూపొందింది. ఆ తర్వాత వీరి కాంబోలో 'జెంటిల్ మెన్' హిందీ రీమేక్ కూడా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత చాన్నాళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ 'మాస్టర్' సినిమాతో కలిసొచ్చారు. ఈ క్రమంలో 'అన్నయ్య' 'డాడీ' 'అందరివాడు' వంటి సినిమాలకు చిరు - అరవింద్ కలిసి వర్క్ చేశారు. అలానే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన 'మగధీర' చిత్రంలో చిరు అతిథి పాత్రలో కనిపించారు.

మెగాస్టార్ - మెగా ప్రొడ్యూసర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో 'శుభలేఖ' 'రౌడీ అల్లుడు' 'SP పరశురాం' 'అన్నయ్య' చిత్రాలను వేరే నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ నిర్మించారు. మొత్తం మీద వీరి కలయికలో తెరకెక్కిన చిత్రాల్లో 8 సూపర్ హిట్స్ గా నిలిస్తే.. మిగతావి యావరేజి ఫ్లాపు లుగా మిగిలాయి. ఇకపోతే చిరంజీవి నటించిన 'చంటబ్బాయ్' 'మహానగరంలో మాయగాడు' 'హీరో' వంటి చిత్రాల్లో అల్లు అరవింద్ నటుడిగా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ తర్వాత తనయుడు రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్స్' బ్యానర్ స్థాపించి తన తండ్రితో సినిమాలు చేస్తున్నారు. మరోవైపు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పై భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ.. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ స్థాపించి చిన్న మీడియం బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News