'ఎల్లమ్మ' గ్లింప్స్.. DSP మేకోవర్ మూమూలుగా లేదు..
బలగం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కమెడియన్ వేణు యెల్దండి.. ఎట్టకేలకు ఇప్పుడు తన రెండో చిత్రంతో సందడి చేసేంందుకు సిద్ధమవుతున్నారు.;
బలగం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కమెడియన్ వేణు యెల్దండి.. ఎట్టకేలకు ఇప్పుడు తన రెండో చిత్రంతో సందడి చేసేంందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఎల్లమ్మ. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఎల్లమ్మ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేయగా, అది సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.
అయితే ఎల్లమ్మ గ్లింప్స్ ప్యూర్ ట్రాన్స్ మోడ్ లో సాగుతోంది. పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్‌బంప్స్ తెప్పించేలా గ్లింప్స్ రూపొందించారు. బలగంలో గ్రామీణ వాతావరణాన్ని, భావోద్వేగాలను న్యాచురల్ గా చూపించిన వేణు, ఎల్లమ్మలోనూ అదే స్థాయిలో బలమైన కథను తీసుకొస్తున్నారని గ్లింప్స్ ద్వారా అర్థమవుతుంది. ముఖ్యంగా లీడ్ రోల్ లో నటిస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హాట్ టాపిక్ గా మారారు.
నిజానికి ఎల్లమ్మ మూవీలో హీరో ఎవరు అన్నదానిపై చాలా రోజులపాటు సస్పెన్స్ కొనసాగింది. చివరికి ఆ ఉత్కంఠకు నేడు తెరపడింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా.. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్.. ఎల్లమ్మ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆయన ఇందులో పార్షి అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపించనున్నారు.
అయితే గ్లింప్స్ స్టార్టింగ్ లోనే గాలిలో సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎగిరే వేపాకుతోపాటు ఆసక్తిగా చూస్తున్న ఓ మేక.. ఏదో ఒక దివ్య శక్తి ఉందనట్టుగా సూచిస్తున్నాయి. గజ్జెల చప్పుడుతో ఒకరు, బూట్లు వేసుకుని మరొకరు పరుగెత్తుకుంటూ రావడం, ఆ వేపాకు మబ్బుల పైకి వెళ్లి అమ్మవారి రూపంగా మారడం వంటి సీన్స్ ఆసక్తి రేపుతున్నాయి. చివర్లో వర్షంలో తడుస్తూ, నడుముకు డోలు కట్టుకుని దేవిశ్రీ ఎంట్రీ ఇవ్వడం హైలైట్ గా నిలిచింది.
డీఎస్పీ మేకోవర్ మామూలుగా లేదని చెప్పాలి. లాంగ్ హెయిర్, షర్ట్ లేకుండా మాస్ లుక్ లో ఆయనను చూస్తుంటే ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతోంది. అయితే ఎల్లమ్మ మూవీకి సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాదే అందిస్తుండడం గమనార్హం. తన డెబ్యూ కోసం అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చుతున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతుంది. కాగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
మట్టి గోడలతో ఉన్న పాతకాలపు ఇంట్లో, మేకుకు వేలాడదీసిన డప్పుతో కూడిన ఆ పోస్టర్ లో డప్పుపై రక్తం మరకలు కనిపించడం సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది. ఏదేమైనా ఎల్లమ్మలో బలమైన భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉండబోతున్నాయని అర్థమవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఎల్లమ్మ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.