స్టేజ్‌పై మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చిన శ్రీలీల‌

ఉగాది కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.;

Update: 2026-03-18 14:59 GMT

ఉగాది కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్న ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల స్టేజ్‌పై సీరియస్‌గా చూసినట్టు కనిపించిన ఒక వీడియో వైరల్ కావడంతో వివాదానికి తెరలేచింది. ఆ వీడియోలో ఆమె చూపు ఆర్టిస్ట్ మహేష్ ఆచంట‌ వైపు ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో అసలు ఏమైంది?, మహేష్ ఏం చేశాడు? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగానే శ్రీలీల ఈ అంశంపై స్పందిస్తూ అసలు నిజం ఏమిటో స్పష్టంగా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, ఆ వీడియో గురించి నాకు ఇటీవలే తెలిసింద‌ని, కానీ వాస్తవానికి అక్కడ ఎలాంటి వివాదం జరగలేద‌ని, అది పూర్తిగా మిస్ కమ్యూనికేషన్ మాత్రమేన‌ని పేర్కొన్నారు. ఈవెంట్ సమయంలో అకస్మాత్తుగా ఒక బీప్ సౌండ్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూసినట్టు తెలిపారు. అదే సమయంలో తన ఫోన్ మహేష్ దగ్గర ఉందని గుర్తొచ్చిందని ఆమె వివరించారు. స్టేజ్‌పైకి వెళ్లే ముందు మహేష్ తనకు సహాయం చేశారని, ఫోన్ కూడా ఆయన దగ్గరే ఉంచానని తెలిపారు. నేను వెన‌క్కి తిరిగిన‌ప్ప‌డు ఫోన్ గురించే చూస్తున్నానని ఆయ‌న అనుకున్నార‌ని, కానీ తాను ఆ సౌండ్ ఏంటా అని చూశాన‌ని, అలా ఒకరికొకరం సైగలతో కమ్యూనికేట్ చేసుకున్నామ‌ని, అంతే తప్ప అక్క‌డ ఎలాంటి ఇష్యూ లేద‌ని క్లారిటీ ఇచ్చారు.

వైరల్ వీడియోపై స్పందిస్తూ, మీరు అనుకున్నట్లుగా అక్కడ ఏమీ జరగలేదని, ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న క్లిప్పింగ్స్ పెద్దగా చూపించడం సాధారణమేన‌ని, ఇది పూర్తిగా అపార్థం మాత్రమే అని శ్రీలీల తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి నిజం లేకుండా ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాద‌ని, ఏదైనా విషయం ఉంటే మేమే ముందుకు వచ్చి చెప్తామ‌ని, ఇలా వీడియోల ఆధారంగా అపార్థాలు చేసుకుని ఇతరులను ఇబ్బంది పెట్టొద్దంటూ నెటిజన్లను కోరారు.

కాగా ఇదే విషయంపై మహేష్ కూడా తన వైపు నుంచి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈవెంట్‌కు ముందు శ్రీలీల తన ఫోన్‌ను కొద్దిసేపు తన దగ్గర ఉంచమని ఇచ్చిందని, తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫోన్ కోసం చూస్తున్నారనుకున్నానని ఆయన తెలిపారు. కానీ వెంటనే ఆమె స్క్రీన్ వైపు చూసిన క్షణాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. దయచేసి ఎవరికీ అగౌరవం కలిగించేలా వ్యాఖ్యలు చేయకండ‌ని మ‌హేష్ నెటిజన్లను ఆయన విజ్ఞప్తి చేశారు.

మొత్తానికి చిన్న అపార్థం కారణంగా సోష‌ల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీగా మారిన ఈ ఘటనపై శ్రీలీల ఇచ్చిన క్లారిటీతో అసలు విషయం బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల ఆధారంగా తక్షణ నిర్ణయాలకు రావద్దని, నిజానిజాలు తెలుసుకుని స్పందించాలని ఆమె సూచించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News