మా అందరికీ ప్రాణవాయువు అన్నయ్యే.. నాగబాబు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో నాగబాబు చేసిన తాజా కామెంట్స్ లో మెగా ఫ్యామిలీకి చిరంజీవి ఎంత కీలకమైన వ్యక్తో స్పష్టంగా కనిపించింది.
కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో నాగబాబు చేసిన తాజా కామెంట్స్ లో మెగా ఫ్యామిలీకి చిరంజీవి ఎంత కీలకమైన వ్యక్తో స్పష్టంగా కనిపించింది. మా అందరికీ ప్రాణవాయువు అన్నయ్య చిరంజీవే అని ఆయన చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లోనే కాదు, సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. తాము ఈ స్థాయిలో నిలబడటానికి ప్రధాన కారణం అన్నయ్య చిరంజీవి కృషి, ఆశీర్వాదం, మార్గదర్శకత్వమేనని ఎంతో ఎమోషనల్ గా చెప్పారు.
ఆయన తన స్పీచ్ లో భాగంగా కేవలం చిరంజీవిని ప్రశంసించడం మాత్రమే కాకుండా, మెగా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆయన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, హనీ ఇలా ఫ్యామిలీలోని అందరి వెనుక చిరంజీవి బలం నిలిచిందని అన్నారు. కుటుంబ సభ్యుల ఎదుగుదలకు ఆయన చూపిన అండ, ప్రోత్సాహం, బాధ్యతను గుర్తు చేస్తూ కృతజ్ఞత వ్యక్తం చేశారు.
అన్నయ్యకు తామెప్పుడూ తిరిగి ఏం చేయలేమని, ఆయనే ఎప్పుడూ మాకు అన్నీ చేస్తుంటారని నాగబాబు చెప్పిన మాటలు ఆయనలోని అభిమానాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించాయి. ముఖ్యంగా ఫ్యామిలీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, చిరంజీవి ముందుండి దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని, ఆ సమస్యను తాము మర్చిపోయినా కూడా ఆయన మాత్రం దాని గురించి అడిగి చూసుకుంటారని చెప్పారు. కుటుంబ పెద్దగా ఆయన తీసుకునే బాధ్యతను నాగబాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.
వరుణ్ తేజ్‌తో చిరంజీవికి ఉన్న అనుబంధాన్ని కూడా నాగబాబు గుర్తు చేశారు. చిన్నప్పటి నుంచి వరుణ్‌ను ఎంతో ప్రేమగా చూసుకున్నారని, తన సినిమాల ప్రివ్యూలకు కూడా వెంట తీసుకెళ్లేవారని చెప్పారు. వరుణ్‌తో స్టోరీలు, కెమెరా, ఫిల్మ్ మేకింగ్ వంటి విషయాలపై అన్నయ్య గంటల తరబడి డిస్కస్ చేస్తారని వివరించారు. ఈ బాండింగ్ సాధారణ కుటుంబ సంబంధాన్ని మించి, ఒక గురువు- శిష్యుడి అనుబంధంలా ఉంటుందని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇవన్నీ చిరంజీవిని కేవలం స్టార్ హీరోగా కాకుండా, కుటుంబానికి మూల స్తంభంగా నిలిచిన వ్యక్తిగా నాగబాబు కామెంట్స్ స్పష్టం చేశాయి.