‘పోస్టు’ పంచాయితీ.. ప్రముఖులు ఎందుకు అడ్డంగా బుక్ అవుతున్నారు?
ఏదీ ఉచితంగా రాదు. ప్రతి దానికి ఒక ధర ఉంటుంది. అలానే చేసే తప్పులకు ఈ సూత్రం వర్తిస్తుంది.
ఏదీ ఉచితంగా రాదు. ప్రతి దానికి ఒక ధర ఉంటుంది. అలానే చేసే తప్పులకు ఈ సూత్రం వర్తిస్తుంది. దీనికి సామాన్యులే కాదు ప్రముఖులకు మినహాయింపు లేదు. ఆ మాటకు వస్తే.. సామాన్యుడు చేసే తప్పునే.. ప్రముఖుడు చేస్తే దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. అందుకే.. సాదాసీదా వ్యక్తి చేసే తప్పునకు భిన్నంగా సెలబ్రిటీలు.. ప్రముఖులు అలాంటి తప్పే చేసినా వారికి జరిగే నష్టం భారీగా ఉంటుంది. సోషల్ మీడియా యుగంలో అది అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అందుకు నిదర్శనంగా తాజాగా తమిళ నటుడు చియాన్ విక్రమ్ ఉదంతాన్ని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. కోరి తెచ్చుకునే తలనొప్పులకు చియాన్ విక్రమ్ మొదటి వాడు కాదు.. చివరి వాడు కూడా కాదు.
లార్ గిబ్బన్ అనే ఒక అరుదైన విదేశీ వానరం (కోతి)తో విక్రమ్ సరదాగా ఆడుకుంటున్న వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ వన్యప్రాణి రక్షణ చట్టాల ప్రకారం అరుదైన.. అత్యంత వేగంగా అంతరించిపోయే జీవ జాతుల్లో ఒకటి లార్ గిబ్బన్ వానరం. దీనిని ప్రైవేటు వ్యక్తులు పెంచుకోవటం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటిని పెంచుకోవాలంటే ప్రత్యేకమైన అనుమతుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ స్టాలో పోస్టు పెట్టినంతనే వన్యప్రాణి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. తనకు జరిగే నష్టాన్ని గుర్తించిన విక్రమ్ సదరు వీడియోను డిలీట్ చేశారు.
అయితే.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తమిళనాడు అటవీ శాఖ సదరు జంతువు మూలాలు.. దానికి సంబంధించిన అనుమతులు తీసుకున్నారా? లేదా? అన్న అంశంపై ఫోకస్ చేసి.. దానిని అక్రమ రవాణా పద్దతుల్లో తెచ్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈ అంశంపై దర్యాప్తు మొదలైంది. ఈ అంశంపై విక్రమ్ బంధువు సీకే రంగనాథన్ ఇంటిపైనా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి అధికారులు ప్రాధమికంగా గుర్తించిన అంశాల్ని చూస్తే.. మణిపూర్ కు చెందిన లైకురామ్ సింగ్ కు వీటిని ఎనిమిది వరకు పెంచుకోవటానికి తగిన పత్రాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇవి మలేషియాకు చెందినవిగా తేలింది. తాను పొందిన అనుమతి పత్రాలతో మూడింటిని తమిళనాడులోని ఈరోడ్ జిల్లా పెరుంతురైకు చెందిన కేశనాథన్ కు అందిస్తే.. అందులో ఒక దానిని విక్రమ్ తెచ్చుకొని పెంచుకున్నట్లుగా సమాచారం.
ఎప్పుడైతే తాను పోస్టు చేసిన వీడియో వివాదాస్పదమై.. వన్యప్రాణి ప్రేమికుల నుంచి ఆగ్రహం.. విమర్శలు రావటంతో విక్రమ్ సదరు వీడియోను డిలీట్ చేశారు. ఇటీవల కాలంలో చూస్తే.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు.. తమ వ్యక్తిగత అభిరుచులు.. ఆసక్తులకు సంబంధించిన వివరాల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. వివాదాల్లో చిక్కుకోవటం తరచూ జరుగుతోంది. ఆ మధ్యన తమిళ హాస్యనటుడు రోబో శంకర్ తన ఇంట్లో పెంచుకుంటున్న ఫారిన్ లలెగ్జాండ్రియన్ చిలుకకు సంబంధించిన హోం టూర్ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పక్షులు.. చిలకలను పంజరంలో బంధించటం నేరం. ఈ వీడియో ఆధారంగా అటవీ శాఖ అతడి ఇంటి మీద దాడి చేసి.. సదరు పక్షులను స్వాధీనం చేసుకోవటమే కాదు.. చట్టపరమైన చర్యలకు చేపట్టి..భారీ ఫైన్ విధించారు.
ఇదంతా చూస్తే..కోరి తలనొప్పులు తెచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రముఖ యూట్యూబర్ కం బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ ఉదంతం తెలిసిందే. ఈ షో చరిత్రలో వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చి.. విజేతగా నిలిచిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అంత ఫేమ్ సొంతం చేసుకున్న అతను తాను పాల్గొన్న ఒక రేవ్ పార్టీలో.. పాములతో ఆడుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై వన్యప్రాణుల అక్రమ రవాణా.. పాము విషాన్ని సరఫరా చేస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసి జైలుకు పంపిన పరిస్థితి.
కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ వర్తూర్ సంతోష్ ఉదంతం కూడా ఇలాంటిదే. అతడి మెడలో వేసుకున్న పులిగోరు డాలర్ ను కెమేరా ముందు ప్రదర్శించటం.. అది కాస్తా టీవీలో టెలికాస్ట్ అయి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీ శాఖ అధికారులు బిగ్ బాస్ సెట్ లోపలకు వెళ్లి మరీ లైవ్ షోలోనే అరెస్టు చేసిన పరిస్థితి. విచారణలో పులిగోరు నిజమైనదని తేలటంతో అతడిపై కఠినమైన వన్యప్రాణి చట్టాల కింద కేసు నమోదైంది. జానీ మాస్టర్ ఉదంతం కాస్త భిన్నమైనది. సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత తమ నోటి నుంచి వచ్చే మాటలకు.. తమ చేతల్ని ప్రజలు పెద్ద ఎత్తున గమనిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ప్రజలకు దగ్గర కావటానికి తమ వ్యక్తిగత విషయాల్ని పంచుకునే ధోరణి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్లో కనిపిస్తోంది. ఇందులో సినిమా రంగానికి చెందిన వారు మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే.. తమ ఉత్సాహం అత్యుత్సాహంగా మారితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాము షేర్ చేసుకునే అంశాల విషయంలో అవగాహన చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో తమకు తప్పుడు భావన లేనప్పటికి.. తాము చెప్పే అంశాలు.. చెప్పే విధానం కొత్త సమస్యలకు కారణమవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
వ్యక్తిగత.. వృత్తిపరమైన అంశాల్ని సోషల్ మీడియాలో పంచుకునే వేళలో అత్యంత అప్రమత్తం అవసరం. ఆ విషయాల్ని పట్టించుకోని వారు తర్వాతి కాలంలో తలనొప్పులు మాత్రమే కాదు.. చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు జానీ మాస్టర్ ఉదంతాన్ని చెప్పొచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా సెలబ్రిటీలను లక్షలాది మంది ఫాలో కావటం.. వారిని అనుకరించటం చేస్తారు. ఇలాంటప్పుడు తమ హోదాను.. తమకున్న ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా చూసుకోవాలంటే అప్రమత్తత చాలా అవసరం.
సినిమా రంగానికి మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కారణంగా పెద్ద పెద్ద పదవుల్ని పోగొట్టుకున్న ప్రముఖులు ఎందరో. అంతేనా.. అత్యున్నత స్థానాల్లో ఉండి తాము పెట్టే పోస్టులతో ఇబ్బందులు ఎదుర్కొనే విషయానికి వస్తే.. ఇటీవల తమిళనాడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్.. ఆ మధ్యన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. మాజీ మంత్రి కేటీఆర్ పెట్టిన పోస్టులు.. చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దిగ్గజ వ్యాపార సంస్థలకు సారథ్యం వహించే వారి తప్పులకు వారి వ్యాపారాలు తీవ్రమైన ప్రభావానికి గురవుతుంటాయి. అందుకు భారత్ పే మాజీ కో- ఫౌండర్ ఉదంతాన్ని చెప్పాలి. అంతేనా.. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం తప్పులో కాలేశారు.
టెస్లా కంపెనీని ప్రైవేటు పరంగా మార్చేస్తున్నానని.. అందుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా చేసిన ఒక పోస్టుకు ఆయన భారీ మొత్తాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ పోస్టును అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి.. ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టింది. టెస్లా బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి రావటమే కాదు వ్యక్తిగతంగా రూ.330 కోట్ల భారీ ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.
గతంలో ప్రముఖులకు చెందిన అంశాల్ని మీడియాలో వచ్చే ముందు.. కొంత ఫిల్టర్ జరిగేది. సదరు మీడియాప్రతినిధి కానీ..మీడియా సంస్థ బాధ్యులు కానీ ప్రముఖులు చేసే వ్యాఖ్యలతో జరిగే డ్యామేజ్ ను ముందుగానే హెచ్చరించటంతో చాలా వరకు వివాదాలు ఫిల్టర్ అయ్యేవి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రముఖులకు పని చేసే పీఆర్ టీంలు.. సోషల్ మీడియా టీం సభ్యులకు అనుభవ శూన్యత.. సమస్యలు తలెత్తే అవకాశాల మీద అవగాహన తక్కువగా ఉండటం కూడా వివాదాలు తలెత్తేందుకు కారణంగా మారుతున్న పరిస్థితి. అందుకే అంటారు.. కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు కానీ.. మాట జారితే వెనక్కి తీసుకోలేం. ఈ పాత కాలపు సామెతను గుర్తుకు తెచ్చుకుంటే చాలు నోటి మాట ఎంత విలువైనదో ఇట్టే అర్థమవుతుంది.