బిగ్ ఛాన్స్.. మంచు విష్ణు రూ.10 కోట్ల ఆఫర్
సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనే కలలు కనే అనేక మంది యువ దర్శకులకు నటుడు మంచు విష్ణు భారీ అవకాశాన్ని ప్రకటించారు.;
సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనే కలలు కనే అనేక మంది యువ దర్శకులకు నటుడు మంచు విష్ణు భారీ అవకాశాన్ని ప్రకటించారు. టాలెంట్ ఉన్నా సరైన అవకాశం దొరకని కొత్త తరానికి తాను వేదిక కల్పించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా AVAA (ఏవా) ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను ప్రారంభిస్తున్నట్లు మకర సంక్రాంతి సందర్భంగా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.
ఆ కాంటెస్ట్ లో విజయం సాధించిన వ్యక్తికి రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఫీచర్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఇది కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ పోటీ మాత్రమే కాదని, దర్శకుడిగా ఉన్న టాలెంట్ ను అన్ని కోణాల్లో పరీక్షించే ప్రాసెస్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వీడియో రిలీజ్ చేసిన మంచు విష్ణు.. తన తండ్రి మోహన్ బాబు యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
“సుమారు యాభై సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అప్పట్లో ఆయనలోని టాలెంట్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది ఒక్కరే ఒక్కరు.. స్వర్గీయ దాసరి నారాయణరావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చిన ఒక్క అవకాశం మా నాన్నగారి జీవితాన్నే మార్చేసింది” అని చెప్పారు మంచు విష్ణు. ఆ సమయంలో వీడియోలో మోహన్ బాబు పాత చిత్రాలను చూపించారు.
ఆ తర్వాత ఇప్పటి కాలంలో టాలెంట్ ను బయటపెట్టేందుకు యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి అనేక డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కానీ అవన్నీ ఉన్నప్పటికీ.. కేవలం ప్లాట్ ఫామ్ ఉండటం మాత్రమే సరిపోదని, సరైన అవకాశం లభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ లోటును పూడ్చేందుకే ఇప్పుడు AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను తాను తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఆ పోటీలో పాల్గొనాలనుకుంటే ఔత్సాహిక దర్శకులు తాము స్వయంగా రూపొందించిన 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ పంపాల్సి ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభ ఆధారంగా షార్ట్ ఫిల్మ్ లను ఎంపిక చేస్తారు. పోటీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు తదుపరి దశలకు వెళ్లే అవకాశం పొందుతారు. కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన వ్యక్తికి పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం లభించనుంది.
ఆ సినిమా బడ్జెట్ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని మంచు విష్ణు స్పష్టం చేశారు. తొలి సీజన్ విజేతను తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజైన మార్చి 19వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. కాంటెస్ట్ కు సంబంధించిన పూర్తి నియమ నిబంధనలు, పాల్గొనే విధానం తెలుసుకోవాలంటే ప్రకటించిన వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయాలని సూచించారు.