బాలీవుడ్ టాప్- 5 'సెల్ఫ్ మేడ్' స్టార్స్
ఈ జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న పేరు కార్తీక్ ఆర్యన్. గ్వాలియర్ నుండి వచ్చి ముంబైలో ఇంజనీరింగ్ చదువుతూ వందలాది ఆడిషన్లు ఇచ్చిన కార్తీక్ 2011లో `ప్యార్ కా పంచనామా`తో బాలీవుడ్ కి పరిచయమయ్యారు.;
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన బాలీవుడ్‌లో నేపోటిజం (వారసత్వం) అనే పదం ఎప్పుడూ చర్చనీయాంశమే. కపూర్లు, ఖాన్‌ల ఏలుబడిలో సామాన్యులకు చోటు లేదనే విమర్శలను తుడిచిపెట్టేలా గత నాలుగైదేళ్లలో కొందరు యువ నటులు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా శిఖరాగ్రానికి చేరుకుంటున్నారు. కేవలం తమ నటన, కష్టం, పట్టుదలను నమ్ముకుని నేడు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ బాలీవుడ్ భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తున్న ఆ `సెల్ఫ్ మేడ్` హీరోల ప్రస్థానం ఇది.
ఈ జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న పేరు కార్తీక్ ఆర్యన్. గ్వాలియర్ నుండి వచ్చి ముంబైలో ఇంజనీరింగ్ చదువుతూ వందలాది ఆడిషన్లు ఇచ్చిన కార్తీక్ 2011లో `ప్యార్ కా పంచనామా`తో బాలీవుడ్ కి పరిచయమయ్యారు. ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలు చేసినా 2018లో వచ్చిన `సోనూ కే టిటు కీ స్వీటీ` ఆయన కెరీర్‌కు అసలైన బ్రేకింగ్ పాయింట్ ఇచ్చింది. ఆ తర్వాత `భూల్ భూలయ్యా 2` వంటి బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను రక్షించిన హీరోగా పేరు తెచ్చుకున్నారు. భూల్ భులయా 3 కూడా పెద్ద హిట్టయింది. ఇప్పటివరకు 16 సినిమాల్లో నటించిన కార్తీక్ నాగ్ జిల్లా సహా అనురాగ్ బసు ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ప్రారంభంలో కేవలం లక్షల్లో ఉన్న ఆయన పారితోషికం, ఇప్పుడు ఒక్కో సినిమాకు 40 నుండి 50 కోట్ల రేంజ్‌కు చేరింది.
మరో వెర్సటైల్ నటుడు రాజ్‌కుమార్ రావు. హర్యానాకు చెందిన అతడు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎఫ్‌టిఐఐ (FTII) నుండి వచ్చి, 2010లో `లవ్ సెక్స్ ఔర్ ధోకా`తో ఎంట్రీ ఇచ్చారు. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం `కై పో చే`. ఇప్పటివరకు 35కి పైగా సినిమాల్లో నటించిన రాజ్‌కుమార్, స్త్రీ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఇటీవల `స్త్రీ 2` తో 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తన సత్తా చాటారు. `విక్కీ విద్యా కా వో వాలా వీడియో ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. ఈయన పారితోషికం ఇప్పుడు 15 నుండి 20 కోట్ల మధ్యలో ఉంది.
ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన జానర్‌ను క్రియేట్ చేశారు. రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టి, 2012లో `విక్కీ డోనర్`తో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్న ఆయుష్మాన్, `అంధాధున్`, `బధాయి హో` వంటి చిత్రాలతో వరుస హిట్లు కొట్టారు. ఇప్పటివరకు 20 సినిమాలు చేసిన ఆయన `డ్రీమ్ గర్ల్ 2` సక్సెస్ తర్వాత మరికొన్ని సామాజిక అంశాలతో కూడిన సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన పారితోషికం ఇప్పుడు 20 నుండి 25 కోట్ల వరకు ఉంది.
యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా ప్రయాణం కూడా ఆసక్తికరమే. ఢిల్లీకి చెందిన సిద్ధార్థ్.. మోడలింగ్ నుండి వచ్చి 2012లో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`తో పరిచయమయ్యారు. ప్రారంభంలో కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినా 2021లో వచ్చిన `షేర్షా` ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇప్పటివరకు 15 సినిమాలు చేసిన సిద్ధార్థ్ ఇటీవల `యోధ` వంటి యాక్షన్ సినిమాతోను మెప్పించాడు. ఈయన పారితోషికం ఇప్పుడు 10 నుండి 15 కోట్ల రేంజ్‌లో ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి నేవీ మర్చంట్. మధ్యతరగతి నుంచి ఎదిగిన హీరో. కరణ్ జోహార్ అతడిని పరిచయం చేసినా కానీ, అతడు పరిశ్రమకు పూర్తిగా ఔట్ సైడర్.
ఇక వెర్సటైల్ నటుడు విక్కీ కౌశల్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆయన తండ్రి స్టంట్ డైరెక్టర్ అయినా కానీ, విక్కీ మాత్రం స్వయంకృషితోనే హీరో అయ్యారు. 2015లో `మసాన్`తో పరిచయమై, `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్` సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు. ఇప్పటివరకు 15 సినిమాలు చేసిన విక్కీ `ఛావా` చిత్రంలో శంభాజీ మహారాజ్ గా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రం ఏకంగా 800కోట్లు వసూలు చేయడం సంచలనం. ఆయన పారితోషికం ఇప్పుడు 15 నుండి 20 కోట్ల రేంజ్‌లో ఉంది. ఇటీవల విక్రాంత్ మాస్సే, రాఘవ్ జుయల్ వంటి స్టార్లు నేపథ్యంతో సంబంధం లేకుండా వచ్చి పాపులరయ్యారు. ప్రస్తుతం వీరంతా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నారు.
ఈ హీరోల సక్సెస్ గ్రాఫ్ గమనిస్తే.. ప్రతి ఒక్కరూ `కంటెంట్`కు ప్రాధాన్యత ఇచ్చి తమ మార్కెట్ పెంచుకున్నారు. ఒకప్పుడు కేవలం లక్షల్లో పారితోషికం అందుకున్న వీరు ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలతో సమానంగా డిమాండ్ చేస్తున్నారు. వీరు సాధించిన విజయాలు కేవలం వారి ఆస్తిని పెంచడమే కాకుండా.. బాలీవుడ్‌లో అవుట్‌సైడర్లకు ఉన్న గౌరవాన్ని, అవకాశాలను పెంచాయి.
బాలీవుడ్ భవిష్యత్తు ఇప్పుడు ఈ సెల్ఫ్ మేడ్ హీరోల చేతుల్లోనే ఉంది. వారసత్వం లేకపోయినా ప్రతిభ , కష్టపడే తత్వం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని కార్తీక్ ఆర్యన్ నుండి రాజ్‌కుమార్ రావు వరకు అందరూ నిరూపిస్తున్నారు. మరో ఐదేళ్లలో వీరు గ్లోబల్ స్థాయిలో ఇండియన్ సినిమా ప్రతిష్టను మరింత పెంచుతారనడంలో సందేహం లేదు.