స‌న్నీ డియోల్ జోరు మామూలుగా లేదుగా

బాలీవుడ్‌లో సీనియర్ స్టార్ సన్నీ డియోల్ ఆరు ప‌దుల వ‌య‌సు దాటినా త‌న జోరును ఏ మాత్రం త‌గ్గించ‌డం లేదు.;

Update: 2026-03-03 18:30 GMT

బాలీవుడ్‌లో సీనియర్ స్టార్ సన్నీ డియోల్ ఆరు ప‌దుల వ‌య‌సు దాటినా త‌న జోరును ఏ మాత్రం త‌గ్గించ‌డం లేదు. వ‌రుస ప్రాజెక్టుల‌తో ఆయ‌న బిజీగా ఉన్న తీరు ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటోంది. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల ఎంపికను పరిశీలిస్తే, తరం మారినా తన మార్క్‌ను నిలబెట్టుకునేలా జాగ్రత్త పడుతున్నట్టు స్పష్టమవుతోంది. రీసెంట్ గా బోర్డర్ 2లో ఆయన కనిపించనున్నారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. బిగ్ స్క్రీన్ పై సన్నీ డియోల్‌ను మళ్లీ చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దేశభక్తి నేపథ్య కథల్లో ఆయనకున్న ప్రత్యేక ఇమేజ్ ఈ ప్రాజెక్ట్‌కు అదనపు బలం చేకూర్చుతోంది.

అదేవిధంగా లాహోర్ 1947 కూడా భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ సంతోషి కాగా, నిర్మాతగా ఆమిర్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. కీలక పాత్రలో ప్రీతీ జింటా కనిపించనుండటం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. స్వాతంత్య్రానికి ముందు కాలాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ సినిమా ఎమోష‌న్స్ తో పాటు చారిత్రాత్మక అంశాలను కూడా మేళవించనుందని సమాచారం.

ఇక తాజాగా అనౌన్స్ చేసిన ఆంటోనీ ప్రాజెక్ట్‌తో సన్నీ డియోల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సినిమాను ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్ధ్వానీ, ఎ.ఆర్. మురుగదాస్ లాంటి ప్రముఖులు కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందని మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో జ్యోతిక సన్నీ డియోల్‌తో కలిసి నటించడం విశేషం. తమిళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన జ్యోతికకు ఇది బాలీవుడ్ లో మరో ముఖ్యమైన అడుగు అని చెప్పొచ్చు. సన్నీ డియోల్ లాంటి సీనియర్ స్టార్‌తో స్క్రీన్ ను షేర్ చేసుకోవ‌డం ఈ ప్రాజెక్ట్‌కు మరింత బరువు తీసుకువచ్చింది. మరోవైపు విలన్ పాత్రలో విజయ్ వర్మ కనిపించనున్నారు. అతని యాక్టింగ్ రీసెంట్ గా మంచి ప్రశంసలు లభిస్తున్న నేపథ్యంలో ఈ క్యారెక్ట‌ర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి.

కాగా రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. సంప్రదాయం ప్ర‌కారం ముహూర్తపు పూజతో మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించారు. సెట్స్‌పై నటీనటులు, సాంకేతిక బృందం హాజరై చిత్రానికి శుభారంభం పలికారు. సన్నీ డియోల్ వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లతో ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే, ఆయన కెరీర్‌లో మరో బిజీ దశ మొదలైనట్టు కనిపిస్తోంది. యాక్షన్ ఇమేజ్‌కు తోడు భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే కథలతో ఆయన కొత్త తరం ఆడియ‌న్స్ ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంటోనీ కథ, రిలీజ్ డేట్ పై మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News