మాస్ రాజా ఫ్యాన్స్.. ప్రిపేర‌వ్వండి

Update: 2022-07-17 05:30 GMT
మాస్ మ‌హారాజాగా ర‌వితేజ‌కు పేరు ఊరికే రాలేదు. అత‌డి సినిమాల్లో మాస్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. యాక్ష‌న్‌కు లోటుండ‌దు. చాలా వ‌ర‌కు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్లోనే సాగుతాయి. అత‌ను కెరీర్లో ఎక్కువ‌గా విజ‌యాలందుకుంది కూడా ఆ టైపు సినిమాల‌తోనే. కాస్త భిన్నంగా ట్రై చేసిన‌పుడ‌ల్లా ర‌వితేజ‌కు ఎదురు దెబ్బ‌లే త‌గిలాయి. క్లాస్ చిత్రాలు, ల‌వ్ స్టోరీలు, అలాగే థ్రిల్ల‌ర్లు.. ఇలా ఏవీ ప్ర‌య‌త్నించినా ఎదురు దెబ్బ‌లే త‌గిలాయి. అలా దెబ్బ తిన్న ప్ర‌తిసారీ తిరిగి త‌న స్ట‌యిల్లో ఒక మాస్ సినిమా చేసి లైన్లో ప‌డ‌డం ర‌వితేజ‌కు అల‌వాటే. డిస్కో రాజా షాక్ త‌ర్వాత క్రాక్‌తో అలాగే ట్రాక్ ఎక్కాడు. ఆపై అత‌ను త‌న స్ట‌యిల్లో చేసిన మాస్ మూవీ ఖిలాడి తేడా కొట్టింది. ఇప్పుడు ర‌వితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇది అత‌డి శైలికి కొంచెం భిన్న‌మైన‌ సినిమా అని ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మైపోతోంది.

కొత్త ద‌ర్శ‌కుడు శర‌త్ మండ‌వ.. ర‌వితేజ‌తో అంద‌రూ చేసే మాస్ మ‌సాలా సినిమా కాకుండా కంటెంట్ డ్రివెన్ మూవీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లున్నాడు. ఇదొక నిఖార్స‌యిన థ్రిల్ల‌ర్ మూవీలా క‌నిపిస్తోంది. ఇంట్రో సాంగ్, ఫైట్.. మ‌ధ్య‌లో రొమాన్స్.. ఇంట‌ర్వెల్ బ్లాక్.. ఇలా లెక్క‌లేసుకుని చేసిన సినిమాలాగా క‌నిపించ‌డం లేదు. క‌థ ప్ర‌ధానంగా సాగుతూ.. కొంత వ‌ర‌కు ర‌వితేజ మార్కు యాక్ష‌న్ స‌న్నివేశాలు, ఎలివేష‌న్ల‌కు అవ‌కాశ‌మిస్తూ న‌డిచే సినిమాలా క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ చూస్తే ఇందులో క‌థే హీరో అనిపిస్తోంది.

తెలుగులో మాస్ హీరోల‌తో ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేయ‌డం త‌క్కువే. ఐతే క‌మ‌ల్ హాస‌న్ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్‌లో ప‌ని చేసిన శ‌ర‌త్.. అక్క‌డ నేర్చుకున్న పాఠాల‌కు అనుగుణంగానే ఈ సినిమా తీసిన‌ట్లున్నాడు. మాస్ రాజా ఫ్యాన్స్ మామూలుగా ఆయ‌న్నుంచి ఆశించే అంశాలు సినిమాలో త‌క్కువే అనిపిస్తోంది. కొంత వ‌ర‌కు ఎలివేష‌న్లు, యాక్ష‌న్ వ‌ర‌కు ఢోకా లేక‌పోవ‌చ్చు కానీ.. ర‌వితేజ నుంచి ఒక పూర్తి స్థాయి థ్రిల్ల‌ర్ చూడ‌డానికి అభిమానులు సిద్ధ‌మై రావాల్సిందే అనిపిస్తోంది.
Tags:    

Similar News