అరటిపండ్లు అమ్మినప్పుడు కూడా నేను కష్టం అనుకోలేదు: మారుతి

Update: 2021-06-16 15:30 GMT
రచన వైపు నుంచి దర్శకత్వం వైపు వచ్చిన దర్శకులలో మారుతి ఒకరుగా కనిపిస్తారు. కెరియర్ తొలినాళ్లలో యూత్ మెచ్చే సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన మారుతి, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించారు. 'భలే భలే మగాడివోయ్' .. 'మహానుభావుడు' సినిమాలు మారుతి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా కనిపిస్తాయి. ఇక 'ప్రతి రోజూ పండగే' సినిమా, ఎమోషన్ ను కూడా మారుతి ఎంత గొప్పగా ఆవిష్కరించగలడనేది నిరూపించింది. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనులతో బిజీగా ఉన్నారు.  

ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ .. "సినిమాల పట్ల గల ఆసక్తితోనే నేను ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వచ్చాను. ఇల్లు గడవడం కోసం ఏవేం చేయాలో చేస్తూ, నేను అనుకున్న మార్గంలో ముందుకు వెళ్లాను. అలా యానిమేషన్ .. యాడ్స్ వైపు నా అడుగులు పడ్డాయి. ఆ తరువాత దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకుంటూ వస్తున్నాను. నేను బయట ప్రపంచాన్ని చూస్తూ పెరిగాను. మాది చాలా మధ్యతరగతి కుటుంబం. మా నాన్న అరటిపండ్లు అమ్మేవారు. ఆయన భోజనానికి ఇంటికి వెళ్లినప్పుడు నేను అరటిపండ్లు అమ్మేవాడిని.

ఆ తరువాత నేను ఎన్నో పనులను చేస్తూ వెళ్లాను .. ఆఫీస్ బాయ్ గా కూడా పనిచేశాను. ఇలా అనేక మలుపులు తిరుగుతూ నా జీవితం కొనసాగడం వలన, మనుషుల మనస్తత్వం ఎక్కువగా చూడగలిగాను .. చదవగలిగాను. అరటిపండ్లు అమ్మేటప్పుడు అదో పెద్ద కష్టమని నేను అనుకోలేదు .. ఆ పనిని కూడా చాలా ఇష్టంగానే చేశాను. థియేటర్ల దగ్గర పోస్టర్లను చాలా ఆసక్తిగా చూసేవాడిని .. ఆ పోస్టర్లను చూస్తూ బొమ్మలు గీసేవాడిని. దర్శకుడిగా నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నా ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావించి చేయడమే" అని చెప్పుకొచ్చారు.   
Tags:    

Similar News