బాలయ్య అల్లుడిపై పూనమ్ సంచలన ట్వీట్

ఈ మధ్య గుంటూరు కారం మూవీ పై కూడా సంచలన వ్యాఖ్య చేసింది.

Update: 2024-05-05 09:48 GMT

నటి పూనమ్ కౌర్.. ఒకప్పుడు వరుస మూవీలు చేస్తూ బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పుడూ ఏదో విషయంపై నెట్టింట స్పందిస్తూ ఉంటోంది. హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ పై పరోక్షంగా ట్వీట్లు చేస్తుంటోంది. ఈ మధ్య గుంటూరు కారం మూవీ పై కూడా సంచలన వ్యాఖ్య చేసింది. అలా ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ ఉంటోంది.

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది పూనమ్ కౌర్. సామాజిక విషయాలపై అప్పుడప్పుడు స్పందించే పూనమ్.. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వరుస ట్వీట్స్ చేస్తోంది. ఇటీవల ఏపీని ఉత్తరప్రదేశ్ తో పోల్చింది. ఏపీ ఈజ్ ద న్యూ యూపీ అంటూ పోస్ట్ పెట్టింది. ఇక నిన్న ఏపీకి చెందిన రాజకీయ నేత గురించి పోస్ట్ చేసింది. హీరో నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ ను ఉద్దేశించి స్పెషల్ గా రాసుకొచ్చింది.

బాలయ్య రెండో అల్లుడైన శ్రీ భరత్ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అదే స్థానంలో ఆయన బరిలోకి దిగినా.. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మరోసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ- బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన.. కంటిన్యూగా ప్రచారం చేస్తున్నారు. అయితే శ్రీ భరత్ ఏదో సాధించేలా కనిపిస్తున్నారని పూనమ్ ట్వీట్ చేసింది.

Read more!

విశాఖపట్నం నుంచి ఆయన గెలిచి పార్లమెంటుకు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుందని పూనమ్ చెప్పుకొచ్చింది. ఎడ్యుకేషన్ ఫ్యూచర్ గురించి శ్రీ భరత్‌ కు ఉన్న విజన్.. కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకూడదన్నట్టుగా అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. తాను భరత్ ను సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించాలని చెప్పింది. ఇది ఎవరూ డబ్బులు ఇచ్చి పెట్టించిన ట్వీట్ కాదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక.. శ్రీ భరత్ మామయ్య, నటుడు నందమూరి బాలకృష్ణ.. ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. హిందూపురం నుంచి మరోసారి బరిలో దిగారు. ఆయన పెద్ద అల్లుడు నారా లోకేష్.. టీడీపీ నేషనల్ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంగళగిరి నుంచి లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. మరి బాలయ్యతో పాటు ఇద్దరు అల్లుళ్ళు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో చూడాలి.



Tags:    

Similar News