కార్తికేయను లైన్లో పెట్టేసిన మారుతి?

Update: 2021-04-19 04:30 GMT
మారుతి సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. కెరియర్ మొదట్లో యూత్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పిస్తూ వాళ్లను కూడా థియేటర్స్ కి రప్పిస్తున్నాడు. యాక్షన్ కి .. ఎమోషన్ కి కామెడీని తోడుగా చేసి కథను నడిపించడం ఆయనకి బాగా తెలుసు. 'మహానుభావుడు' తరువాత ఆయనకి ఇంతవరకూ సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్నాడు. రాశి ఖన్నా కథానాయికగా అలరించనుంది.

వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్ హీరోతో 'బాబు బంగారం' చేసిన మారుతి, ఆ తరువాత శర్వానంద్ .. నాగచైతన్య .. సాయితేజ్ వంటి యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. మళ్లీ గోపీచంద్ వంటి సీనియర్ స్టార్ హీరోతో సెట్స్ పైకి వెళ్లాడు. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన ఏ హీరోతో చేయనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈ సారి కూడా ఆయన ఓ యంగ్ హీరోనే ఎంచుకున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో కాదు .. 'కార్తికేయ'. మారుతి తరువాత సినిమా హీరోగా ఇప్పుడు కార్తికేయ పేరునే ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రస్తుతం కార్తికేయ శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన వివరాలతో ఒక వీడియో వదిలారు. కార్తికేయ లుక్ కొత్తగా అనిపించింది. ఆ తరువాత ఆయన గీతా ఆర్ట్స్ 2 - సుకుమార్ రైటింగ్స్ నిర్మించే సినిమాలో చేసే అవకాశం ఉంది. ఇది రూమర్ కాదు .. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు. ఆ తరువాత సినిమా మాత్రం మారుతితో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కాంబినేషన్ అదుర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది ఎంతవరకూ నిజమనేదే తేలాల్సి ఉంది.
Tags:    

Similar News