మరో పండక్కి అప్పుడే పెద్ద క్యూ.. విన్నర్ ఎవరో?

అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ కూడా దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.;

Update: 2026-02-18 12:30 GMT

టాలీవుడ్ లో ప్రతి పండుగకు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ కు బోలెడు సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. మంచి వసూళ్లూ సాధించాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ దసరా పండుగ పై పడింది. ఆ ఫెస్టివల్ వస్తే స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు 2026 దసరాకు అప్పుడే పెద్ద క్యూ కట్టేశాయి.

స్టార్ హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు అందరూ తమ సినిమాలను పండుగ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండటంతో ఈసారి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు మేకర్స్ అధికారిక ప్రకటనలు చేయడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదటగా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న NBK 111 మూవీ దసరా బరిలో నిలవనుంది.

వారిద్దరూ ఇప్పటికే కలిసి చేసిన వీర సింహారెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో.. కొత్త సినిమాపై అంచనాలు అందరిలో పెరిగాయి. టైటిల్ కూడా ప్రకటించకముందే ఆ ప్రాజెక్ట్‌ పై భారీ హైప్ నెలకొనడం విశేషం. బాలయ్య మాస్ ఎలిమెంట్స్‌ తో వచ్చే ఆ చిత్రం దసరా సీజన్‌ కు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌ గా ఉండనుందని సినీ ప్రియులు, అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ కూడా దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ఉన్న కథతో ప్రేక్షకులను అలరించనుంది. ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని చెప్పాలి.

బాలయ్య, ప్రభాస్ తో పాటు యంగ్ హీరో రోషన్ మేక కూడా దసరా రేసులో అడుగుపెడుతున్నారు. ఆయన నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఏమో ఏమో ఇది మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ తెచ్చుకుంది. హిట్ ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్ యూత్‌ ను ఆకట్టుకోవడంతో సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ కనిపిస్తోంది.

తమిళ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న శేయోన్ తెలుగులోనూ దసరా సీజన్‌ ను టార్గెట్ చేస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఆ మూవీ.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సాగే పవర్‌ ఫుల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దసరా సెలవులు ఎక్కువ రోజులు ఉండటం నిర్మాతలకు ప్లస్ పాయింట్. ఒకేసారి నాలుగు ఐదు సినిమాలు విడుదలైనా కలెక్షన్లకు మంచి అవకాశం ఉంటుంది, కానీ పోటీ గట్టిగా ఉంటుంది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న సినిమాలే చివరికి విన్నర్స్ గా నిలుస్తాయి. మరి ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News