మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లోబో!

Update: 2021-12-10 09:30 GMT
టాలీవుడ్ లోకి కొత్తగా అడుగుపెట్టిన దర్శకులు చిరంజీవితో ఒక సినిమా చేస్తే చాలు అనుకుంటారు. నిర్మాతలైతే ఆయనతో ఒక సినిమా చేసే అవకాశం వస్తే అంతకన్నా కావలసినదేవుంటుంది అనుకుంటారు. ఇక నటీనటులైతే చిరంజీవి సినిమాలో ఆయనతో కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు అనుకుంటారు. అదే తమ కల .. అదే తమ ఆశయం అన్నట్టుగా వాళ్లు ముందుకు వెళుతుంటారు. అలాంటి చిరంజీవి సినిమాలో తనకి ఛాన్స్ వచ్చిందని 'లోబో' పొంగిపోతున్నాడు. తన సన్నిహితులతో ఈ విషయాన్ని పంచుకుని మురిసిపోతున్నాడు.

మొదటి నుంచి కూడా 'లోబో' ఒక చిత్రమైన గెటప్పుతో ప్రేక్షకులను ఆకర్షించాడు. ఆయన హెయిర్ స్టైల్ .. గెడ్డం .. కాస్త్యుమ్స్ .. డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పటికప్పుడు హెయిర్ కలర్ మార్చేస్తూ .. ఒక కాలుకు ఒక కలర్ షూ .. మరో కాలుకు మరో కలర్ షూ వేస్తూ అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు. ఇక ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ గుర్తింపు కారణంగానే బిగ్ బాస్ హౌస్ లోను చోటుసంపాదించుకున్నాడు.

అప్పటివరకూ 'లోబో'ను బుల్లితెరపై కొంతసేపు మాత్రమే చూస్తూ వచ్చిన ప్రేక్షకులు, ఈ రియాలిటీ షో ద్వారా 'లోబో'ను చాలా దగ్గరగా చూడగలిగారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ .. అప్పుడప్పుడు ఎమోషన్స్ కి గురవుతూ 'లోబో' బిగ్ బాస్ హౌస్ ద్వారా చాలామందిని ఆకట్టుకున్నాడు. అయినా ఆయన బయటికిపోక తప్పలేదు. అలా బయటికి వెళ్లిన 'లోబో' ఏకంగా చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఇంతకుముందు సందడి చేసిన వాళ్లంతా ఎక్కడో ఒక చోట తెరపై కనిపిస్తూనే ఉన్నారు.

అలాగే 'లోబో'కి కూడా సినిమాల్లో ఛాన్సులు రావొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ ఏకంగా ఆయన చిరంజీవి సినిమాలో అవకాశాన్ని అందుకున్నాడు. ''నా కల నిజమైంది చిరంజీవిగారి సినిమాలో ఛాన్స్ వచ్చింది" అంటూ చిరంజీవితో దిగిన ఒక ఫొటోను ఇన్ స్టా ద్వారా ఆయన షేర్ చేశాడు. 'భోళా శంకర్' సినిమాలో తనకి అవకాశం వచ్చిందనే విషయాన్ని వెల్లడించాడు. రీసెంట్ గా ఒక టీవీ షోలో కూడా ఆయన ఈ విషయాన్ని గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.


Tags:    

Similar News