''విక్రమ్'' కోసం 'కేజీఎఫ్' స్టంట్ మాస్టర్స్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారే..!

Update: 2021-06-13 01:30 GMT
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ''విక్రమ్''. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న 'ఇండియన్ 2' లేట్ అవుతుండటంతో కమల్ ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. లోకనాయకుడి కెరీర్లో వస్తున్న ఈ 232వ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

''విక్రమ్'' సినిమాకి యాక్షన్ కంపోజ్ చేయడానికి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు-అరివ్ లను తీసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'కేజీఎఫ్' చిత్రానికి అద్భుతమైన యాక్ష‌న్‌ కొరియోగ్ర‌ఫీ చేసిన అన్బు-అరివ్.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' - రవితేజ 'ఖిలాడి' - సూర్య40 చిత్రాలకు వీరు ఫైట్ మాస్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కమల్ సినిమాని ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం దక్కించుకున్నారు. లెజండ్ కమల్ హాసన్ సార్ తో ఆరంభించడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నామని స్టంట్ ద్వయం పేర్కొన్నారు.

కాగా, ''విక్రమ్'' చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ - మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ చిత్రానికి యువ సంచలనం అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'ఖైదీ' 'మాస్టర్' వంటి రెండు వరుస సూపర్ హిట్స్ అందుకున్న లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు కమల్ హాసన్ తో చేస్తున్న 'విక్రమ్' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News