స్టార్ హీరోలను దూరం పెడుతున్న స్టార్ హీరోయిన్...?

Update: 2020-06-16 06:00 GMT
కీర్తి సురేష్ పేరు వినగానే సినీ ప్రేక్షకులకు 'మహానటి' సినిమా గుర్తుకు వస్తుంది. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కించిన 'మహానటి' సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరాధించే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె 'జాతీయ ఉత్తమ నటి' అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. కాగా కీర్తి సురేష్ తెలుగులో రామ్ హీరోగా నటించిన 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన 'నేను లోకల్' సినిమాతో టాలీవుడ్ లో స్థిరపడిపోయింది. తమిళ్ లో పెద్ద పెద్ద స్టార్లతో నటించిన కీర్తి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి' చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలలో యాక్ట్ చేస్తూ వచ్చినప్పటికీ స్టార్ హీరోల పక్కన నటించలేదు.

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని అందరూ అనుకున్నారు. అయితే కీర్తి సురేష్ ఈ వార్తలను ఖండించిందట.. ఇంకా ఆ ప్రాజెక్ట్ చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉన్న‌ట్లుగా ఆమె వెల్లడించారట. అయితే ఈ బ్యూటీ మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే స్టార్ హీరోల సరసన నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదేమో అని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే కంటే మిడిల్ రేంజ్ హీరోలతో న‌టించ‌డానికి మ‌క్కువ చూపుతున్నారని అనుకుంటున్నారు. ఇప్ప‌టి వరకు ఈ బ్యూటీ న‌టించిన స్టార్ హీరోల సినిమాలు అన్ని అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డ‌మే దీనికి కార‌ణం అని అనుకుంటున్నారు.

అయితే ఒక్కసారి కీర్తి నటించిన స్టార్ హీరోల సినిమాలు గురించి ఆలోచిస్తే నిజ‌మే అనిపిస్తోంది. కీర్తి స్టార్ హీరోలతో నటించిన 'అజ్ఞాతవాసి' 'భైరవ' 'రైలు' 'స్వామి 2' సినిమాల లిస్ట్ చెక్ చేస్తే స‌రిపోతుంది. అంతేకాకుండా తెలుగులో ఈ బ్యూటీ 'మిస్ ఇండియా' 'గుడ్ లక్ సఖీ' 'రంగ్ దే' 'పెంగ్విన్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ స్టార్ హీరోల సినిమాలు కావు. ఇక కీర్తి సురేష్ సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించి రెండేళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎన్నో ఆశ‌లు పెట్టుకుని నటించిన 'పెంగ్విన్' ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఆగాను కాబ‌ట్టి మ‌ళ్లీ త‌న‌కి పేరుని తీసుకొచ్చే పాత్ర‌ల‌నే చేయాల‌ని కీర్తి ఆలోచిస్తున్న‌ట్లుగా కాస్టింగ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఇప్పటికే ఆమె నటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ 'అన్నాతే' మరియు మోహన్‌ లాల్ 'మరక్కార్ : అరబికదలింటే సింహం' సినిమాలు రిలీజ్ అయితే కానీ కీర్తి సురేష్ స్టార్ హీరోల సెంటిమెంట్ నిజమో కాదో అనేది తెలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News