బాబోయ్ పవన్.. ఇదేం క్రేజయ్యా

Update: 2017-03-24 09:55 GMT
మన స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత హంగామా ఉంటుందో తెలిసిందే. అభిమానులు ఒక రకమైన మాయలో ఉంటారపుడు. థియేటర్ల దగ్గర మామూలు హంగామా ఉండదు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ స్టార్ల సినిమాలకు హైప్ ఉండటం.. మెజారిటీ థియేటర్లను ఒకే సినిమాతో నింపేయడం.. టికెట్ల కోసం డిమాండుండటం.. బెనిఫిట్ షోలు.. ఇవన్నీ మామూలే. కానీ పరాయి రాష్ట్రంలో కూడా ఇదే క్రేజ్ తెచ్చుకునే హీరోలు కొద్దిమందే ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కోవలోకే వస్తాడు. అతడి కొత్త సినిమా ‘కాటమరాయుడు’కి తమిళనాడులో మామూలు క్రేజ్ లేదు. తమిళ హిట్ మూవీ ‘వీరం’కు ‘కాటమరాయుడు’ రీమేక్ కావడంతో అజిత్ అభిమానులు పవన్ ను బాగా ఓన్ చేసుకున్నారు. మామూలుగా కూడా ఈ సినిమాకు తమిళనాట మంచి హైప్ వచ్చింది.

ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా లేని స్థాయిలో 150కి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు ‘కాటమరాయుడు’ చిత్రాన్ని. మల్టీప్లెక్సుల్లో అయితే తమిళ సినిమాల్ని పక్కనబెట్టి ‘కాటమరాయుడు’కు భారీగా స్క్రీన్లు ఇచ్చారు. తెల్లవారుజామున నుంచే భారీగా బెనిఫిట్ షోలు పడ్డాయి. మాయాజాల్ మల్టీప్లెక్సులో తొమ్మిది స్క్రీన్లు ఉంటే ఆ తొమ్మిది స్క్రీన్లలోనూ ‘కాటమరాయుడు’ షోలు పడ్డాయి. పీవీఆర్ మల్టీప్లెక్సులో ‘కబాలి’ సినిమాను తొలి రోజు 62 షోలు వేస్తే.. ‘కాటమరాయుడు’కు 58 షోలు పడుతుండటం అనూహ్యమైన విషయం. ఇంకా సత్యం.. పలాజో.. లక్స్.. ఎస్-2.. ఇలా ప్రతి మల్టీప్లెక్స్ లోనూ ‘కాటమరాయుడు’ హవా సాగుతోంది. ఈ చిత్రానికి తమిళనాడు అంతటా కూడా అనూహ్యమైన ఓపెనింగ్ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో పవన్ క్రేజ్ కొత్తేదేమీ కాదు కానీ.. తమిళనాడులో సైతం పవన్ సినిమాకు ఇంత హైప్ రావడం ఆశ్చర్యకరమైన విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News