షూటింగ్ లో గాయపడ్డ రాజశేఖర్.. 'బైకర్' వచ్చేదెప్పుడు?
సీనియర్ హీరో, స్టార్ నటుడు రాజశేఖర్.. ఇప్పుడు బైకర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.;
సీనియర్ హీరో, స్టార్ నటుడు రాజశేఖర్.. ఇప్పుడు బైకర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. యువ కథానాయకుడు శర్వానంద్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ మూవీకి అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ను కొన్ని నెలలుగా జరుపుతున్నారు.
అయితే రీసెంట్ గా షూటింగ్ లో రాజశేఖర్ గాయపడినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో ఆయన కాలి మడమకు తీవ్రమైన గాయమైందట. ముఖ్యంగా, మడమ ఎముక పలుచోట్ల పగిలినట్లు సమాచారం. దీంతో తీవ్ర నొప్పితో బాధపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించగా, ఆపరేషన్ తప్పదని వైద్యులు సూచించారు.
కాలు మడమ భాగంలో బోన్ ఫ్రాక్చర్ కావడంతో ఆయన అత్యవసరంగా ఆపరేషన్ చేయించుకున్నారు. రెండు గంటలకు పైగా కొనసాగిన ఆపరేషన్ లో ఆర్థోపెడిక్ బృందంతో రాజశేఖర్ సమన్వయం చేస్తూ పూర్తిగా సహకరించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగవుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
"గత వారం బైకర్ మూవీ షూటింగ్ సందర్భంగా ఓ ప్రమాదం జరిగింది. యాక్షన్ సీన్ ను షూట్ చేస్తుండగా రాజశేఖర్ కాలికి తీవ్రంగా దెబ్బ తగిలింది. చీలమండలో పలు ఫ్రాక్చర్లు ఉన్నాయి. తీవ్రమైన నొప్పి ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయన సర్జరీకి సహకరించారు. రెండు గంటల పాటు జరిగిన సర్జరీ సక్సెస్ అయింది" అని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
రాజశేఖర్ కు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టంగా సూచించారు. ముఖ్యంగా మడమను ఏ విధంగా కూడా అస్సలు కదిలించకూడదని, కనీసం మూడు వారాల నుంచి నాలుగు వారాల వరకు బెడ్ రెస్ట్ తప్పనిసరి అని తెలిపారట. దీంతో రాజశేఖర్ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ జనవరిలో సెట్స్ లో అడుగు పెట్టనున్నట్లు సమాచారం.
అయితే ఆ ఘటన కారణంగా బైకర్ మేకర్స్ షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ ఆరోగ్యమే ప్రధానంగా భావించి.. షూటింగ్ షెడ్యూల్ ను మార్చుతున్నట్లు సమాచారం. ఆయన గాయం నుంచి కోలుకున్న వెంటనే సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
నిజానికి.. బైకర్ మూవీ డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అనౌన్స్ కూడా చేశారు. కానీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించేందుకు వాయిదా వేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత రాజశేఖర్ గాయపడ్డారు. మరి బైకర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.