ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ వార్నింగ్...!

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;

Update: 2025-12-08 10:04 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ వేలాది మంది జనాలు చేరడం మనం చూస్తూ ఉంటాం. కోలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో అజిత్ ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి స్టార్ హీరో కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా రేసింగ్ టోర్నమెంట్స్ లో కూడా ముందుంటాడు. కార్ రేసింగ్ టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ కుమార్ ఇటీవల ఒక టోర్నమెంట్ కి హాజరు అయ్యాడు. ఆ సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అజిత్ కుమార్ ని చూసేందుకు మొత్తం ఈవెంట్ ని డిస్టర్బ్ చేసే విధంగా ప్రవర్తించారు. దాంతో అభిమానులపై అజిత్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పరువు పోయే విధంగా ప్రవర్తించొద్దు అంటూ అభిమానులను సున్నితంగా హెచ్చరించాడు. అదే సమయంలో ఇతర టీం లకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని సూచించాడు. తన రిప్యుటేషన్ దెబ్బ తినడం మాత్రమే కాకుండా మనందరి రిప్యుటేషన్ కూడా దెబ్బతింటుందని ఫ్యాన్స్ కి చెప్పాడు.

రేసింగ్ టీం కి అజిత్ కుమార్...

సాధారణంగా అజిత్ కుమార్ చాలా సున్నితంగా ఇలాంటి విషయాలను డీల్ చేస్తాడని పేరుంది. అభిమానులపై ఎక్కువ నోరు పారేసుకోకుండా వారిని అదుపులో పెడతాడని కూడా అంటారు, కానీ ఈసారి అభిమానులు హద్దులను దాటడంతో ఆయన కూడా తన మాటల హద్దులు దాటాల్సి వచ్చిందని కొందరు సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగ్ లకు ప్రాధాన్యత ఇస్తున్నాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కానీ ఆయన మాత్రం తన అభిరుచిని పక్కన పెట్టకుండా సినిమాలు చేస్తూనే రేసింగ్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదటి నుండి కూడా తనకు ఇష్టమైన రేసింగ్ పక్కన పెట్టకుండా అదొక హాబీగా అజిత్ కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తనకంటూ ఒక టీం క్రియేట్ చేసి... ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ పలు విజయాలను తెచ్చిపెట్టాడు. అలాంటి అజిత్ కి కచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన మాటలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రేసింగ్...

అజిత్ పలు అంతర్జాతీయ రేసింగ్ టోర్నమెంట్లో తన టీం తో పాల్గొన్నారు. ఆమధ్య ఒక రేసింగ్ ట్రాక్ లో అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో అజిత్ గాయాల పాలయ్యాడు. అయినా కూడా తన టీం ఆటోర్నమెంట్ ని పూర్తి చేసింది. ఆ టోర్నమెంట్లో అజిత్ టీం టాప్ లో నిలిచింది, అంతేకాకుండా ఇండియా పేరుని అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపించేలా చేసింది. సినిమాల్లోనే కాకుండా అజిత్ ఇలా రేసింగ్ టోర్నమెంట్ లో కూడా విజయాలను సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు మరింతగా పెరుగుతున్నారు. అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతుండడంతో ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో జరుగుతున్న రేసింగ్ టోర్నమెంట్స్ కి అప్పుడప్పుడు ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది జరుగుతుందని కొందరు వాపోతున్నారు. అందుకే అజిత్ తాజాగా ఫ్యాన్స్ విషయంలో మన అందరి రిప్యుటేషన్ పోకుండా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు.

వరుస సినిమాలతో అజిత్ కుమార్...

రేసింగ్ లతో బిజీగా ఉన్నప్పటికీ అజిత్ వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తమిళనాడు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఈయన నటిస్తున్న తమిళ సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోతున్నాయి, గతంలో తమిళ్తో సమానంగా తెలుగులోనూ కలెక్షన్స్ సొంతం చేసుకున్న అజిత్ కుమార్ ఇప్పుడు తెలుగులో మార్కెట్ తగ్గిపోవడంతో తమిళం కి పరిమితం అవుతున్నాడు. గతంలో ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది, కానీ తెలుగులో జరిగిన మార్పుతో అజిత్ ముందు ముందు కూడా తెలుగు సినిమా చేసే అవకాశాలు కనిపించడం లేదు. భవిష్యత్తులో తమిళంలో కూడా ఆయన సినిమాలు చేస్తాడా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా రేసింగ్ టీం పై దృష్టి పెడితే సినిమాలపై ఆయన దృష్టి తగ్గించే అవకాశాలు ఉన్నాయని కొందరి అభిప్రాయం.

Tags:    

Similar News