అది చిరంజీవికే సాధ్యం.. కానీ!

Update: 2018-04-25 10:34 GMT
కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు దర్శకరత్న దాసరి నారాయణరావు. దాసరి ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నారో.. ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నారో ఆయన ఉన్నపుడు అందరూ గుర్తించలేదు. కానీ ఆయన వెళ్లిపోయాక గొప్పదనం అర్థమవుతోంది. చాలామంది ఇప్పుడు దాసరి పేరును తలుచుకుంటున్నారు. సమస్యలు తలెత్తినపుడల్లా దాసరి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి ఇష్యూ ఇండస్ట్రీని కుదిపేసిన నేపథ్యంలో ఈ మాట ఎక్కువగా వినిపించింది. ఐతే ఇలా బాధపడి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు దాసరి పాత్రను ఎవరు పోషిస్తారన్న దానిపై దృష్టిసారించాల్సి ఉంది. ఆ తరహా పెద్ద మనిషి పాత్ర పోషించే వ్యక్తి కోసం ఇండస్ట్రీ ఆశగా చూస్తోంది. వ్యక్తిత్వం.. స్థాయి.. జనాల్లో.. ఇండస్ట్రీలో ఉన్న ఆదరణ ప్రకారం చూస్తే ఇందుకు మెగాస్టార్ చిరంజీవే సరైనవాడు అన్నది మెజారిటీ అభిప్రాయం.

మెగాస్టార్ కూడా దాసరి స్థానాన్ని భర్తీ చేసే విషయంలో సుముఖంగానే ఉన్న సంగతి గతంలో కొన్ని సందర్భాల్లో వెల్లడైంది. గత కొంత కాలంగా చిరంజీవి ఇండస్ట్రీలో ఎవరికే ఇబ్బంది వచ్చినా స్పందిస్తున్నారు. మంచి పనుల కోసం.. ఆపదలో ఉన్న వారి కోసం విరాళాలు ఇస్తున్నారు. తనకు సంబంధం లేని కార్యక్రమాలకు సైతం హాజరవుతున్నారు. ఇక ఇండస్ట్రీలో ఆయన మాటంటే మెజారిటీ జనాలకు గురి ఉంది. గౌరవం ఉంది. ఆయన్ని వ్యతిరేకించేవాళ్లు తక్కువే. నందమూరి బాలకృష్ణ లాంటి వాళ్లు తప్పితే ఆయన ఆధిపత్యాన్ని ప్రశ్నించకపోవచ్చు. బాలయ్య కూడా నేరుగా ఒక మాట అనకపోవచ్చు. పరోక్షంగా ఏమైనా వ్యతిరేకతను ప్రదర్శించవచ్చేమో. ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించడంలో ఉన్న కష్టమేంటో తెలుసుకాబట్టి మిగతా వాళ్లు చిరును వెనక్కి లాగే ప్రయత్నం చేయకపోవచ్చు. ఐతే సమస్యల్లా ఏంటంటే.. చిరంజీవి మెతక. ఆయన ఎవరినీ ఒక మాట అనలేరు. దాసరి లాగా మొహమాటం లేకుండా విమర్శించలేరు. ఎవరినీ విమర్శించలేరు. వివాదాస్పద అంశాలు తలెత్తినపుడు మాట్లాడటానికి ఇష్టపడరు. ఉదాహరణకు చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తినపుడు దాసరి లాగా చిరు వాయిస్ వినిపించగలరా? శ్రీరెడ్డి తరహా ఇష్యూ వచ్చినపుడు వెంటనే స్పందిస్తారా? మందలించగలరా? రెండు వర్గాల మధ్య తగాదా తలెత్తితే దాసరిలా జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో మాట్లాడి సయోధ్య కుదర్చగలరా? తన పనులు మానుకుని దాసరిలా ఇతరుల సమస్యల కోసం తన విలువైన సమయాన్ని కేటాయించగలరా? ఇలాంటి సందేహాలున్నాయి. ఐతే దాసరిలా ఎవ్వరూ చేయలేరు కాబట్టి చిరు తన చేతనైనంత వరకు మంచి చేయగలిగితే.. ఇండస్ట్రీ పెద్ద పాత్ర పోషిస్తే చాలన్నది సినీ జనాల మాట.
Tags:    

Similar News