2025 టాలీవుడ్‌కు గుడ్ ఆర్ బ్యాడ్?
దీంతో 2025 టాలీవుడ్‌కు బ్యాడ్ ఇయర్‌గా మారిపోయింది. టాలీవుడ్ కంటే ఈ ఏడాది బాలీవుడ్‌కు చాలా ఏళ్ల తరువాత కలిసొచ్చింది.;
టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఇండియన్ సినీ దిగ్గజాలతో పాటు వరల్డ్ సినిమా తలెత్తి ఆశ్చర్యంగా చూస్తున్న రోజులివి. హాలీవుడ్ సైతం టాలీవుడ్ సినిమాలని ప్రశంసిస్తోంది. దానికి కారణం మన నుంచి విడుదలైన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవని నిరూపించడమే. అయితే ఆ ట్రెండ్‌కు ఈ మధ్య బ్రేక్ పడిందా? ఈ విషయంలో 2025 టాలీవుడ్‌కు బ్యాడ్ లక్‌గా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
గత ఏడాది టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీస్‌గా పుష్ప 2, కల్కి 2898ఏడీ విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి టాప్ 10లో నిలిచాయి. ఈ ఏడాది మాత్రం ఆ స్థాయిలో తెలుగు సినిమా మెరుపులు మెరిపించలేకపోయింది. కారణం ప్రభాస్, అల్లు అర్జున్ వంటి క్రేజీ హీరోల సినిమాలు బరిలోకి దిగకపోవడమే. ఈ ఏడాది పవన్ కల్యాణ్ నటించిన `ఓజీ` మాత్రం తెలుగు సినిమా పరువు నిలబెట్టి అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.
2024లో సందడి చేసిన ప్రభాస్ సినిమా ఏదీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలాగే క్రౌడ్ పుల్లింగ్ చేయగల హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ `వార్ 2`తో ప్రేక్షకుల ముందుకొచ్చినా అది హిందీ సినిమా కావడం, అందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం.. సినిమాలో ఆశించిన స్థాయిలో కంటెంట్ లేకపోవడంతో `వార్ 2` తెలుగు జాబితాలోకి రాదు. వరుస ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలని కలవర పెట్టిన తెలుగు సినిమా ఈ ఏడాది మాత్రం పేలవమైన ప్రదర్శనని కనబరిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమాకు, టాలీవుడ్‌కు 2025 బ్యాడ్ ఇయర్ అన్నట్టే. రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` డిజాస్టర్‌తో ఈ ఏడాది మొదలైనా `సంక్రాంతికి వస్తున్నాం`, `ఓజీ` మాత్రమే బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పరువు నిలబెట్టాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఒక్క బిగ్ హిట్ తప్ప మరో పాన్ ఇండియా హిట్ టాలీవుడ్ ఖాతాలో లేకపోవడం నిజంగా బ్యాడే. పెద్ద హీరోల సినిమాలేవీ ఈ ఏడాది బరిలోకి దిగకపోవడం.. అన్నీ పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్ దశలోనే ఉండటంతో పాన్ ఇండియాను శాసించిన ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి.
దీంతో 2025 టాలీవుడ్‌కు బ్యాడ్ ఇయర్‌గా మారిపోయింది. టాలీవుడ్ కంటే ఈ ఏడాది బాలీవుడ్‌కు చాలా ఏళ్ల తరువాత కలిసొచ్చింది. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు రికార్డు స్థాయి వసూళ్లతో పాటు రికార్డు స్థాయిలో విజయాల్ని సొంతం చేసుకున్నాయి. విక్కీ కౌశల్ `చావా` ఇందులో ముందు వరుసలో నిలిచింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ వీరోచిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రికార్డు స్థాయిలో రూ.800 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ఆ తరువాతి స్థానంలో లవ్ స్టోరీ `సైయారా` రూ.600 కోట్లు రాబట్టింది. ఇప్పుడు అదే ఫీట్‌ని రిపీట్ చేస్తూ రణ్‌వీర్ సింగ్ `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని నమోదు చేస్తోంది.
ఇప్పటి వరకు రూ.600 కోట్లు రాబట్టిన `ధురంధర్` సంజు, పద్మావత్ రికార్డుల్ని సమయం చేసి సరికొత్త సంచలనాల దిశగా పయనిస్తోంది. ఇక హిందీ సినిమాల తరువాత బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ. ఈ ఏడాది `కాంతార చాప్టర్ 1` సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.850 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తరువాత ఇదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ `మహావతార్ నరసింహా` బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచింది. రూ.40 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి రూ.300 కోట్లకు పై చిలుకు వసూళ్లని అందించారు. ఆ తరువాత తన ఉనికిని చాటుకుంది మలయాళ సినిమా లోక చాప్టర్ 1. రూ.30 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఓవరాల్‌గా ఈ ఏడాది టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలని చూస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. స్టార్ లేకపోయినా సరే కంటెంట్ బాబగుందంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడమే కాకుండా కాసులు వర్షం కురిపిస్తారని ఈ ఏడాది నిరూపించడం గమనార్హం.