ఎదురులేని విజయం .. తిరుగులేని ప్రయాణం .. కొరటాల!

Update: 2021-06-15 04:30 GMT
కొరటాల శివకి రచయితగా .. దర్శకుడిగా మంచి  క్రేజ్ ఉంది. రచయితగా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన, 'బృదావనం' .. 'సింహా' వంటి సినిమాలకి పనిచేశారు. రచయితగా తన కెరియర్లో అందుకున్న భారీ విజయాలు అవి. అలాంటి కొరటాల ఆ తరువాత దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. తన సినిమాలకి తనే కథ .. మాటలు .. స్క్రీన్ ప్లే రాసుకుంటారు. అన్నీ పక్కాగా కుదిరితేనే ఆయన సెట్స్ పైకి వెళతారు. తన కథపై .. పాత్రలపై పూర్తి క్లారిటీతోనే ఆయన రంగంలోకి దిగుతారు. అందువల్లనే అపజయమనేది ఆయనకి ఎదురుపడే సాహసం ఇప్పటివరకూ చేయలేదు.  

ఇంతవరకూ ఆయన తీసినది నాలుగు సినిమాలే. ఆ జాబితాలో మిర్చి .. శ్రీమంతుడు .. జనతా గ్యారేజ్ .. భరత్ అనే నేను కనిపిస్తాయి. ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి విజయం సాధించాయి. ఆయా హీరోల కెరియర్లో  చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. అందువల్లనే ఆయన స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు. కొరటాల సినిమాలో వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. అయితే ఆ సందేశం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేదిలా కాకుండా సున్నితంగా .. అంతర్లీనంగా ఉంటుంది. యాక్షన్ కీ .. ఎమోషన్ కి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
Read more!

కొరటాల తన సినిమాల్లో కామెడీకంటూ ప్రత్యేకమైన ట్రాకులు పెట్టరు. కథలో కలిసిపోయే కామెడీ సున్నితంగా ఉండేలా చూసుకుంటారు. ఇక సంభాషణలు కూడా సింపుల్ గా ఉండేలా రాసుకుంటారు. హీరో హీరోయిన్ల లుక్ విషయంలో మాత్రం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. హీరోని హ్యాండ్సమ్ గా .. హీరోయిన్ ను చాలా గ్లామరస్ గా చూపిస్తారు. ఇక సంగీతానికి కూడా ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆయన సినిమాల్లో పాటలు .. వాటిని చిత్రీకరించే తీరు ఆకర్షణీయంగా ఉంటాయి.

ప్రభాస్ .. మహేశ్ బాబు .. ఎన్టీఆర్ లకు భారీ విజయాలను అందించిన కొరటాల, చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' సినిమాను చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపుదశకు చేరుకుంది. ఇంతవరకూ కొరటాల చేసిన సినిమాల్లో తారాగణం పరంగాను ... బడ్జెట్ పరంగాను ఇదే పెద్ద సినిమా. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ తో కలిసి మరోసారి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ రోజున కొరటాల పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.            
Tags:    

Similar News