ఓవ‌ర్సీస్ పై థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం ఎంత‌?

Update: 2021-08-22 23:30 GMT
తెలుగు సినిమాల‌కు ఓవ‌ర్సీస్ మార్కెట్ పెద్ద అండగా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో తెలుగు సినిమాలు బిగ్ స్కేల్ లో రిలీజ్ అవుతూ భారీ వ‌సూళ్లు తెచ్చేవి. ఎన్.ఆర్.ఐలు ఓ కామ‌న్ మ్యాన్ లా అక్క‌డ తెలుగు సినిమాల వీక్ష‌ణ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ఇటీవ‌లి కాలంలో ఆ ఒర‌వ‌డి మ‌రింతగా పెరిగింది. దీంతో తెలుగు సినిమా మార్కెట్ ప‌రిది కూడా  అంత‌కంత‌కు విస్త‌రిస్తోంది. అమెరికా  ఓవ‌ర్సీస్  రిలీజ్ హ‌క్కులే 20 కోట్ల నుంచి 30 కోట్ల మ‌ధ్య‌లో అగ్ర హీరోల చిత్రాలు అమ్మ‌డు పోతున్నాయి. యావ‌రేజ్ గా 6  కోట్ల వ‌ర‌కూ చిన్న చిత్రాలు అమ్మ‌డవుతున్నాయి. ఇది దేశీయ మార్కెట్ తో స‌మానంగానే  ఉంది.

`బాహుబ‌లి` ఫ్రాంఛైజీ చిత్రాలు అమెరికాలో 200 కోట్లు పైగా వ‌సూళ్ల‌ను సాధించాయి. ఓవ‌ర్సీస్ అంతా క‌లిపి బాహుబ‌లి ఈ స్థాయి వ‌సూళ్ల‌ను సాధించింది. ఏ భాషా సినిమాకు లేని క్రేజ్ ఒక్క సినిమాకు అమెరికా మార్కెట్ లో దొరుకుతుంది. అందుకే  తెలుగులో ఎలాంటి హీరో అయినా స‌రే ఓవ‌ర్సీస్ లోనూ త‌మ సినిమాల్ని రిలీజ్ చేసుకోవ‌డానికి ఉత్సాహం చూపిస్తారు. బెస్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌ని ఎంపిక చేసుకుని ఓవ‌ర్సీస్ లో మంచి బిజినెస్ చేసుకుంటున్నారు నిర్మాత‌లు. అయితే క‌రోనా దెబ్బ‌కి మొత్తం సీన్ మారిపోయింది. ప్ర‌స్తుతానికి అక్క‌డా థియేట‌ర్లు మూత ప‌డే ఉన్నాయి.భ‌యంతో జ‌నాలు థియేట‌ర్ వైపు చూడ‌టం లేదు.

అర‌కొర‌క‌గా  థియేట‌ర్లు తెరిచినా చూసే నాధుడు క‌నిపించ‌డం లేద‌ని మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి.  అలాగే ఈ ఏడాదిన్న ర కాలంగా ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు బాగా అల‌వాటు ప‌డిపోవ‌డం కూడా ఓ కార‌ణంగా వినిపిస్తుంది. పైగా క్రైసిస్ లో యూఎస్ సినిమా చూడ‌టం కూడా లాస్ గానే క‌నిపిస్తుంది. అక్క‌డ టిక్కెట్ ధ‌ర బాగా ఎక్కువ‌. ఒక సినిమా చూసే  రేటుతో ఒక ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్  వ‌చ్చేస్తుంది. కొత్త సినిమాలు ఎలాగూ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. వీట‌న్నింటి కార‌ణంగా ఓవ‌ర్సీస్ మార్కెట్ బాగా దెబ్బ‌తింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ లు లేక‌పోవ‌డం కూడా మ‌రో కార‌ణంగా వినిపిస్తుంది.  ఇటీవ‌ల విడుద‌లైన `రాజ రాజ చోర‌`కు మంచి టాక్ వ‌చ్చినా వారాంతానికి ల‌క్ష డాల‌ర్లు కూడా తీసుకురాలేని ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అంటే ఓవ‌ర్సీస్ ఎంత డ‌ల్ గా ఉందో  అర్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు అమెరికాలో థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం క‌నిపిస్తోంద‌న్న వార్త‌ల‌తోనూ ఈ ప‌రిస్థితి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. విదేశాల్లో ఇంకా వైర‌స్ భ‌యం అలానే ఉంది. క్లాస్ ఆడియెన్ సేఫ్టీ కోస‌మే ఇంకా ఆలోచించ‌డం కూడా థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌కు ఇబ్బందిక‌రంగా మారింద‌ని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News