నేను కూడా బాధితురాలినేః హీరోయిన్‌

Update: 2021-05-27 02:30 GMT
తాను పాఠ‌శాల‌లో చ‌దువుకున్న రోజుల్లో.. కుల వివ‌క్ష‌తోపాటు లైంగిక వేధింపుల‌ను సైతం ఎదుర్కొన్నాన‌ని సినీ న‌టి గౌరీకిష‌న్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఇటీవ‌ల చెన్నైలోని ఓ క‌ళాశాల‌కు చెందిన అధ్యాప‌కుడు విద్యార్థుల‌పై కుల, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన విష‌యం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. మిగిలిన పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు కూడా త‌మకు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకుంటున్నారు. తాజాగా.. గౌరీకిష‌న్ త‌న అనుభ‌వాన్ని వెల్ల‌డించారు.

''చదువుకునే రోజులు అందరికీ మధుర జ్ఞాప‌కాలుగా ఉంటాయ‌ని భావిస్తారు. కానీ.. అవే రోజులు కొంద‌రికి భ‌యాన‌కంగా ఉంటాయి. నేను కూడా అలాంటి అనుభ‌వాల‌ను చ‌విచూశాను. నాలాంటి అమ్మాయిలు వేల సంఖ్య‌లో ఉన్నార‌నే విష‌యం తీవ్రంగా బాధిస్తోంది. పాఠ‌శాల విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్ కు బాట‌లు వేసే మైదానం కావాలి కానీ.. వారి విలువ‌ల‌ను కూల్చేసే స్థ‌లం కాకూడ‌దు’’అంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేశారు గౌరీకిష‌న్‌.

ఇంకా.. దీనికి కొన‌సాగింపు రాశారు. ''నేను చదివిన అడాయర్ హిందూ సీనియర్ సెకండరీ పాఠశాలలో భయంకర సంఘటనలు ఎక్కువగా జ‌రుగుతుంటాయి. విద్యార్థుల‌పై లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్ కుల వివ‌క్ష వంటివి ఎన్నో జ‌రుగుతాయి. నేను స్వ‌యంగా ఎదుర్కొన్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెల‌సు. ఆ టీచ‌ర్ల పేర్లు ఇప్పుడు అవ‌స‌రం లేదుగానీ.. ఇలాంటివి ధైర్యంగా ఎదుర్కొన‌డం ద్వారా వ్య‌వ‌స్థ‌లో మార్పు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నా’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

మనదేశంలో కుల వ్యవస్థ ఎంత దారుణంగా వేళ్లూనుకుపోయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ కార‌ణంగానే.. ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. చ‌దువు ద్వారా సంఘాన్ని సంస్క‌రించి, స‌న్మార్గంలో న‌డిపించాల్సిన ఉపాధ్యాయులు కూడా కులం రొంపిలో ప‌డి బొర్లాడుతుండ‌డం.. అమాయ‌కులైన పిల్ల‌ల‌ను వేధించ‌డం దేశ‌భ‌విష్య‌త్ కు గొడ్డ‌లి పెట్టు వంటిద‌నే అభిప్రాయం వ్య‌క‌మ‌వుతోంది.
Tags:    

Similar News