మల్టీప్లెక్స్ లో వినూత్న మార్పులు.. వినోదంతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా!
ముఖ్యంగా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి కలగాలి అంటే థియేటర్ వాతావరణాన్ని మార్చడమే కాకుండా సీట్లను మొదలుకొని అక్కడి లొకేషన్ కూడా ప్రేక్షకుడిని మెప్పించగలగాలి.;
ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించడమే కాదు.. అందులో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేయగలగాలి. ముఖ్యంగా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి కలగాలి అంటే థియేటర్ వాతావరణాన్ని మార్చడమే కాకుండా సీట్లను మొదలుకొని అక్కడి లొకేషన్ కూడా ప్రేక్షకుడిని మెప్పించగలగాలి. అప్పుడే ఆ థియేటర్ కి ప్రేక్షకులు బారులు తీరుతారు అనడంలో సందేహం లేదు. ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడంలో ఇది కూడా ఒక ట్రిక్ అని చెప్పవచ్చు.
థియేటర్ లోపల అధునాతన సీటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తే సినిమా చూడడంతో పాటు థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కూడా పొందుతారు. అలాగే మంచి డాల్బీ విజన్ , భారీ స్క్రీన్, కలర్ డెప్త్ ఇవన్నీ కూడా థియేటర్లలో ఏర్పాటు చేయగలిగితే ఆటోమేటిక్ గా ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ యాజమాన్యం కూడా ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడం కోసం థియేటర్లలో భారీ మార్పులు చేయడమే కాకుండా ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో వినూత్న మార్పులు అందుబాటులోకి తీసుకొస్తూ ప్రేక్షకుడికి మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ను అందించడానికి సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగానే కొత్తగా రాబోతున్న ఈ థియేటర్లలో మరిన్ని వినూత్న సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇకపోతే ఇప్పటికే 4కే, ఐమాక్స్ బిగ్ స్క్రీన్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లకే ఫిదా అవుతున్న ఆడియన్స్ ముందుకు త్వరలో బిగ్ ఫీచర్లతో మల్టీప్లెక్స్ రాబోతున్నాయి. మరి వాటి ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కోకాపేటలో అల్లు సినిమాస్..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోకాపేటలో అల్లు సినిమాస్ పేరుతో త్వరలో అధికారికంగా మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నారు. 75 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ స్క్రీన్, డాల్బీ విజన్ అందించే అద్భుతమైన కలర్ డెప్త్, డాల్బీ అడ్వాన్స్ ద్వారా చుట్టుముట్టే సౌండ్ ఇవన్నీ కలిస్తే ప్రేక్షకుడి సినిమా అనుభవాన్ని పెంచేసి.. సినిమా చూస్తున్నాను అనే భావనను మరచి మరో లోకంలో వెళ్లి పోవాల్సిందే. ముఖ్యంగా హైదరాబాదులో థియేటర్ అనుభూతికి ఇది ఒక కొత్త బెంచ్ మార్క్ గా మారనుంది.
వనస్థలిపురంలో రవితేజ ఆర్ట్ సినిమాస్..
ఇప్పటికే మల్టీప్లెక్స్ రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న ఏషియన్ సినిమాస్.. మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో కలిసి మల్టీప్లెక్స్ లు నిర్వహిస్తూ ఐకానిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు రవితేజ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఈ ఏషియన్ సినిమాస్ వనస్థలిపురంలో ఆర్ట్ సినిమాస్ పేరిట భారీ స్థాయిలో మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ ఎపిక్ స్క్రీన్ సినిమాని మరింత గాఢంగా అనుభూతి చెందేలా చేస్తోంది. 2026 జూన్ నాటికి మాస్ ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో AMB క్లాసిక్ పేరుతో మరో కొత్త మల్టీప్లెక్స్ ను తీసుకురావాలన్న ప్లాన్ ఈ రంగంలో మరింత ఆసక్తికర చర్చకు దారితీసింది అని చెప్పవచ్చు.
ఇక ఏషియన్ సినిమాస్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ సంస్కృతిని నడిపిస్తున్న పివిఆర్ ఇనాక్స్ కూడా హైదరాబాద్లో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే 55 అడుగుల వెడల్పు గల పిఎక్స్ఎల్ స్క్రీన్ తో పాటు గాలి, సువాసన , పొగ మంచు వంటి ప్రత్యేక ఎఫెక్ట్స్ ఇచ్చే 4dx స్క్రీన్లు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే కూకట్పల్లి, బండ్లగూడ, ఎల్బీనగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని ఓడియన్ మాల్ లో కొత్త పివిఆర్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇవన్నీ కూడా ప్రేక్షకుడికి లగ్జరీ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నాయని చెప్పవచ్చు.