భర్త నుంచి కోట్లలో 'భరణం' అందుకున్న నటీమణులు
సినిమా రంగంలో సెలబ్రిటీల వివాహాలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో.. వారి విడాకుల వ్యవహారాలు కూడా అంతే హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.;
సినిమా రంగంలో సెలబ్రిటీల వివాహాలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో.. వారి విడాకుల వ్యవహారాలు కూడా అంతే హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా విడాకుల సమయంలో భర్త నుండి భార్యకు అందే `భరణం` విషయంలో వినిపించే అంకెలు సామాన్యులను విస్మయానికి గురిచేస్తుంటాయి. చట్టప్రకారం భార్యకు భర్త ఆస్తిలో సగం లేదా గౌరవప్రదమైన జీవనానికి సరిపడా భరణం ఇవ్వాల్సి ఉంటుంది. సెలబ్రిటీల ఆస్తులు కోట్లలో ఉంటాయి కాబట్టి సగం ఆస్తి అంటే అది వందల కోట్లకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో భారీ భరణంతో వార్తల్లో నిలిచిన కొందరు ప్రముఖుల వివరాలు పరిశీలిస్తే..
బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా హృతిక్ రోషన్ - సుసానే ఖాన్ వ్యవహారం నిలిచింది. వీరిద్దరూ విడిపోయే సమయంలో సుసానే సుమారు 400 కోట్ల రూపాయలు భరణంగా డిమాండ్ చేశారని.. చివరికి హృతిక్ 380 కోట్ల రూపాయలు చెల్లించారని ప్రచారం ఉంది. అదేవిధంగా నటి కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్ నుండి విడిపోయేటప్పుడు ముంబైలోని విలాసవంతమైన ఫ్లాట్‌తో పాటు, పిల్లల పేరిట 14 కోట్ల రూపాయల బాండ్లను అందుకున్నారు. వీటిపై వచ్చే వడ్డీ ద్వారానే కరిష్మాకు నెలకు లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది.
నటుడు సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య అమృతా సింగ్‌కు 2004లో విడాకులు ఇచ్చే సమయంలో అప్పట్లోనే దాదాపు 5 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని భరణంగా చెల్లించారు. అలాగే నిర్మాత ఆదిత్య చోప్రా తన మొదటి భార్య పాయల్ ఖన్నాకు విడాకులు ఇచ్చి రాణి ముఖర్జీని పెళ్లాడే క్రమంలో దాదాపు 50 కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. మలైకా అరోరా కూడా అర్బాజ్ ఖాన్ నుండి విడిపోయే సమయంలో దాదాపు 15 కోట్ల రూపాయలు భరణం కింద తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక దక్షిణాది విషయానికి వస్తే.. దళపతి విజయ్ - సంగీత విడాకుల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. విజయ్ తన భార్యకు దాదాపు 250 కోట్ల రూపాయలు భరణంగా ఇస్తున్నారని వార్తలు వస్తున్నా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. విజయ్ ఆస్తి వేల కోట్లలో ఉండటంతో అభిమానులు ఈ రకమైన లెక్కలు వేస్తున్నారు. అలాగే అమీర్ ఖాన్ - కిరణ్ రావు విడిపోయినప్పుడు వందల కోట్ల విలువైన ఆస్తులను కిరణ్ కి అందినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. అలాగే క్రికెటర్ చాహల్ - ధనశ్రీ వర్మ విడిపోయే క్రమంలో 4.75 కోట్ల భరణం ఇచ్చారని కథనాలొచ్చాయి.
అయితే కొందరు సెలబ్రిటీల విషయంలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని తేలింది. నటి హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకుంటున్నారని, భరణం కోరుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో భరణం ప్రస్థావన లేదని తేలింది.
చివరగా వందల కోట్లు ఆఫర్ చేసినా ఆత్మగౌరవంతో తిరస్కరించిన వారు కూడా ఉన్నారు. వెటరన్ నటీమణి రేవతి, బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్, స్టార్ హీరోయిన్ సమంత కూడా భర్త నుంచి భరణం అందుకోలేదని కథనాలొచ్చాయి. తన స్వయంశక్తితో సంపాదించుకోగలనని ఆత్మ గౌరవంతో జీవించగలమని ఈ మహిళా సెలబ్రిటీలు నిరూపించారు. ఇలా విడాకుల వ్యవహారాల్లో కొందరు భారీ భరణంతో వార్తల్లో నిలిస్తే.. మరికొందరు మాత్రం డబ్బు కంటే ఆత్మగౌరవమే మిన్న అని చాటి చెప్పారు.