హరీష్ ప్రామిస్ కు తగ్గట్టు ఉస్తాద్ ఉంటుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై దర్శకుడు హరీష్ శంకర్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి.;

Update: 2026-03-12 02:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై దర్శకుడు హరీష్ శంకర్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే హరీష్ శంకర్ ఇచ్చిన హామీలు ఎక్కువగా ఉన్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేలా ఆయన మాట్లాడుతున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ మూవీని అభిమానులు ఎంతగా నచ్చారో అందరికీ తెలిసిందే. అదే భావనను కొనసాగించేలా, ఆ సినిమాకు ఒక విధంగా ట్రిబ్యూట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఉండబోతుందని ఆయన చెప్పారు.

అభిమానులకు గబ్బర్ సింగ్ ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని, ఆ మూవీలోని ఎంటర్టైన్మెంట్ ను కొనసాగించే ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతూ కూడా హరీష్ శంకర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. హాలీవుడ్ లో వచ్చిన ఇంటర్ సెల్లార్ లాంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందినా, తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం కమర్షియల్ సినిమాలకు ఉన్న ఆదరణ వేరే స్థాయిలో ఉంటుందని ఆయన అన్నారు.

ఉదాహరణగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సింహ సినిమాను ప్రస్తావించారు. 'ఇంటర్‌ స్టెల్లర్ కంటే బోయపాటి శ్రీను తీసిన సింహ సినిమానే థియేటర్లలో బాగా నడిచింది. అలాంటి మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం నేను కూడా సినిమా తీస్తున్నాను' అని హరీష్ శంకర్ చెప్పారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు.

తన దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా విజయం సాధించిన తర్వాత మహేష్ బాబును ప్రత్యేకంగా కలిశానని తెలిపారు. ఆయన తన పనిని ప్రశంసించడం ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. అంతేకాదు మహేష్ బాబుపై ఎవరైనా విమర్శలు చేస్తే తాను అసలు సహించనని చెప్పారు. 'మహేష్ పై ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడితే అది నాకు నచ్చదు. అలాంటి విమర్శలు చేస్తే నేను చూడలేను' అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు ఆయన సినిమా గురించి భారీ ప్రామిస్లు చేస్తుండడం, మరోవైపు గబ్బర్ సింగ్ రేంజ్ లో ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందని చెప్పడం వల్ల అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి భారీ డైలాగ్స్ చెప్పడం సాధారణమే అయినప్పటికీ, చివరికి ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకునేది మాత్రం కంటెంట్ మాత్రమే అని అంటున్నారు. హరీష్ శంకర్ హామీలకు తగ్గట్టుగా ఉస్తాద్ ఉంటే అభిమానులకు పండగే. లేకపోతే అదే హైప్ దర్శకుడికి ఒత్తిడిగా మారే అవకాశం ఉంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News