రాజ‌మౌళికి పోటీ మ‌రో ప‌దేళ్ల త‌ర్వాతేనా?

రాజమౌళి కేవలం ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఓ బ్రాండ్.;

Update: 2026-03-12 03:00 GMT

రాజమౌళి కేవలం ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఓ బ్రాండ్. `బాహుబలి`తో భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేసారు. అటుపై `ఆర్ ఆర్ ఆర్` తో ఆస్కార్ వేదికపై తెలుగు జెండాను ఎగురవేసిన ఘ‌నుడు. మ‌రి అలాంటి లెజెండ‌రీ ద‌ర్శ‌కుడిని మించిన మ‌రో దర్శకుడు టాలీవుడ్ నుండి రావడానికి ఎంత సమయం పడుతుంది? అస‌లు అది సాధ్యమేనా? అంటే అదంత సుల‌భం కాదు. రాజమౌళిని మించిన దర్శకుడు రావడానికి కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. దానికి కాలానుగుణమైన సాంకేతికత, అంతర్జాతీయ మార్కెట్ అవగాహన తోడవ్వాలి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే రాజమౌళి స్థాయిని అందుకోవడానికి , అధిగమించడానికి మరో 10 నుండి 15 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి ఒక సినిమాతో ఈ స్థాయికి రాలేదు. ఆయన 20 ఏళ్ల కఠోర శ్రమ, అపజయమే లేని ప్రయాణం జ‌క్క‌న్నను నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలబెట్టాయి.

రాజమౌళిని అధిగమించాలంటే ఉండాల్సిన మొదటి లక్షణం విజన్. రాజమౌళి ఒక కథను ఎంచుకున్నప్పుడు అది కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాకుండా? విదేశీ ఆడియన్స్‌కు కూడా అర్థమయ్యేలా యూనివర్సల్ ఎమోషన్ కూడా క‌థ‌లో ఉండేలా చూసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సుకుమార్, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి దర్శకులకు ఆ సత్తా ఉంది. ప్ర‌ముఖంగా నాగ్ అశ్విన్ `కల్కి 2898 ఏడీ`తో ప్రపంచ స్థాయి మేకింగ్‌ను పరిచయం చేశారు. ఇలాంటి దర్శకులు తమ తదుపరి చిత్రాలతో గ్లోబల్ మార్కెట్‌ను పక్కాగా పట్టగలిగితే రాజమౌళికి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకోవచ్చు.

సాంకేతిక పరిజ్ఞానంలో రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ వాడకంలో ఓ మాస్టర్. అయితే టెక్నాలజీ అనేది రోజురోజు మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ ప్రొడక్షన్ మరింత అందుబాటులోకి వస్తాయి. రాబోయే పదేళ్లలో వచ్చే కొత్త తరం దర్శకుడు ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించుకుని రాజమౌళి కంటే తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌తో అంతకంటే గొప్ప విజువల్ వండర్స్‌ను సృష్టించగలిగితే అప్పుడు జక్కన్న రికార్డులను బ్రేక్ చేయోచ్చు.

రాజమౌళిని మించిన దర్శకుడు రావడానికి అడ్డుగా ఉన్న అతిపెద్ద అంశం ఆయనలో స్థిరత్వం. జ‌క్క‌న్న‌ కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఈ రికార్డును బ్రేక్ చేయడం ఏ దర్శకుడికైనా అతి పెద్ద స‌వాల్. కేవలం ఒక భారీ హిట్ కొట్టినంత మాత్రాన రాజమౌళిని మించినట్లు కాదు. వరుసగా ఐదు -పది చిత్రాలను అదే స్థాయిలో, అదే విజయావకాశంతో తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు రావడానికి దశాబ్ద కాలంపైనే పడుతుంది.

ఒకప్పుడు శంకర్ కంటే గొప్ప దర్శకుడు లేరనుకున్నారంతా. కానీ రాజమౌళి వచ్చారు. ఇప్పుడు రాజమౌళి కంటే గొప్పవారు లేరనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక కొత్త దర్శకుడు వస్తాడు. ఆయన ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉండవచ్చు. ఏదైనా దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా ఉండి ఉండవచ్చు. 2035 - 2040 నాటికి టాలీవుడ్ నుండి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వేల కొట్లు రాబ‌ట్టే ఓ మహా దర్శకుడు ఉద్భవించే అవకాశం ఉంది.

Tags:    

Similar News