స్టార్ డైరెక్ట‌ర్ ఏడాదికో సినిమా సాధ్య‌మే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సినిమాలు పూర్తి చేయ‌డానికి సంవ‌త్స‌రాల పాటు స‌మయం తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-12 02:45 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సినిమాలు పూర్తి చేయ‌డానికి సంవ‌త్స‌రాల పాటు స‌మయం తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన త‌ర్వాత రిలీజ్ వ్య‌వ‌ధి అంత‌కంత‌కు పెరిగిపోతుంది. రాజమౌళి, సుకుమార్, ప్ర‌శాంత్ నీల్, సందీప్ రెడ్డి వంటి దిగ్గజ దర్శకులు ఒక ప్రాజెక్ట్ కోసం రెండు నుండి నాలు గేళ్లు కేటాయించాల్సి వస్తోంది. అయితే ఈ వేగాన్ని పెంచి ఏడాదికో సినిమా విడుదల చేయాలంటే నిర్మాణ ప్రక్రియలో కొన్ని విప్లవాత్మక మార్పులు అంతే అవ‌స‌రం.

తొలుత ప్రీ-ప్రొడక్షన్ పక్కాగా ఉండాలి. హాలీవుడ్ తరహాలో స్క్రిప్ట్ వర్క్, స్టోరీ బోర్డింగ్ , లొకేషన్ల ఎంపిక సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే వంద శాతం పూర్తి కావాలి. షూటింగ్ స్పాట్‌లో మార్పులు చేర్పులు చేయడం వల్ల సమయం వృధా అవుతుంది. ఒకసారి కెమెరా ఆన్ అయిందంటే రోజువారీ ప్లానింగ్ ప్రకారం చకచకా షూటింగ్ సాగిపోవాలి. దర్శకులు కేవలం మేకింగ్‌పైనే కాకుండా, టైమ్ మేనేజ్‌మెంట్‌పై కూడా దృష్టి పెట్టినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

రైటింగ్ డిపార్ట్‌మెంట్ బలోపేతం కావడం. మన దగ్గర దర్శకులే కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు రాసుకునే పద్ధతి ఉంది. దీనివల్ల ఒత్తిడి పెరిగి మేకింగ్ ఆలస్యమవుతోంది. అదే వెస్ట్రన్ దేశాల్లో లాగా ఒక బలమైన రైటర్స్ రూమ్ ఉంటే దర్శకుడు కేవలం టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టవచ్చు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, మరో కథను సిద్ధం చేసే బృందం దర్శకుడికి తోడుగా ఉంటే ఏడాదికో సినిమా చేయడం సులభతరం అవుతుంది.

అధునాతన సాంకేతికత వాడకం అంతే అవ‌స‌రం. ప్రస్తుతం మన దర్శకులు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనికి బదులుగా వర్చువల్ ప్రొడక్షన్ , ఏఐ వంటి టెక్నాల జీలను వాడితే షూటింగ్ సమయంలోనే మెజారిటీ గ్రాఫిక్స్ పనులను పూర్తి చేయవచ్చు. లోకేషన్లకు వెళ్లకుండానే సెట్స్ లోనే రియలిస్టిక్ లుక్ తీసుకురావడం వల్ల ప్రయాణ సమయం , ఇతర ఖర్చులు తగ్గి సినిమా వేగంగా పూర్తిచేయోచ్చు.

నటీనటుల కాల్‌షీట్లు , బడ్జెట్ ప్లానింగ్ అత్యంత కీల‌కం. స్టార్ హీరోలు ఏకకాలంలో రెండు సినిమాలు చేయడానికి ఇష్ట పడితే దర్శకులకు కూడా వెసులుబాటు ఉంటుంది. అలాగే నిర్మాతలు కూడా వడ్డీల భారం పెరగకుండా ఉండాలంటే షెడ్యూల్స్ మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలి. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఒకే ఫ్లోలో వర్క్ జరిగేలా ప్లాన్ చేస్తే అనవసరమైన జాప్యాన్ని నివారించవచ్చు. స్టార్ డైరెక్టర్లు తమ సొంత ప్రొడక్షన్ టీమ్స్ లేదా అసోసియేట్లకు కొన్ని పనులను అప్పగించడం కూడా కెరీర్ స్పీడ్ పెంచుతుంది.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్, క్రియేటివిటీ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్న అంశాలు. ప్రతి సినిమాను ఒక విజువల్ మాస్టర్ పీస్ గా తీయాలనే తపన మంచిదే కానీ అది కాలయాపనకు దారి తీయకూడదు. దర్శకులు ఒక సినిమా పూర్తి కాగానే సుదీర్ఘ విరామం తీసుకోకుండా నిరంతర ప్రక్రియగా సినిమాలు చేస్తూ ఉండాలి. పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు గతంలో అనుసరించిన స్పీడ్ మేకింగ్ పద్ధతిని నేటి టెక్నాలజీతో కలిపి పాటిస్తే స్టార్ డైరెక్టర్లు కూడా ఏడాదికో సినిమాను ప్రేక్షకులకు అందించడం అసాధ్యమేమీ కాదు.

Tags:    

Similar News