8 వారాల విండో: నిర్మాతలు వర్సెస్ ఓటీటీలు.. దిగొచ్చేదెవరు?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడను కాపాడేందుకు ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు) తీసుకున్న `8 వారాల ఓటీటీ విండో` నిర్ణయం ఇప్పుడు నిర్మాతలకు, ఓటీటీ సంస్థలకు మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.;
దక్షిణాది చిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడను కాపాడేందుకు ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు) తీసుకున్న `8 వారాల ఓటీటీ విండో` నిర్ణయం ఇప్పుడు నిర్మాతలకు, ఓటీటీ సంస్థలకు మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. తాజాగా జరిగిన దక్షిణాది సినీ ఎగ్జిబిటర్ల సమావేశంలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించారు. అందులో మొదటిది, ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన 8 వారాలు లేదా 56 రోజుల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాకూడదు. రెండవది దశాబ్దాలుగా కొనసాగుతున్న రెంటల్ సిస్టమ్ (అద్దె పద్ధతి)ను రద్దు చేసి, పర్సంటేజ్ (వసూళ్లలో వాటా) పద్ధతిలోకి మారాలని నిర్ణయించడం. ఈ నిర్ణయం టాలీవుడ్ నిర్మాతలను తీవ్రమైన సందిగ్ధంలోకి నెట్టింది.
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా 4 వారాల విండో పద్ధతి అమల్లో ఉంది. అయితే సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించాలంటే 8 వారాల నిబంధన తప్పనిసరి అని వారు భావిస్తున్నారు. ఉత్తరాదిలో పీవీఆర్-ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ చైన్స్ ఇప్పటికే ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు దక్షిణాదిలో కూడా ఇదే పద్ధతిని అమలు చేస్తే తప్ప థియేటర్లు నిలబడలేవని ఎగ్జిబిటర్లు గట్టిగా చెబుతున్నారు.
అయితే ఈ నిబంధన అమలు చేయడం నిర్మాతలకు ఒక సవాలుగా మారింది. ఎందుకంటే ఓటీటీ సంస్థలు ఇచ్చే భారీ మొత్తమే ఇప్పుడు చాలా సినిమాల నిర్మాణానికి ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోతే వెంటనే ఓటీటీలో విడుదల చేయడం ద్వారా నిర్మాతలు తమ పెట్టుబడిని కొంతవరకు వెనక్కి తెచ్చుకోగలుగుతున్నారు. ముఖ్యంగా తెలుగు నిర్మాతలకు సినిమా ఫ్లాప్ అయినా త్వరగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇస్తే అదనపు నగదు చెల్లించేందుకు ఓటీటీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు 8 వారాల గడువు విధిస్తే ఓటీటీ సంస్థలు తమ ఆఫర్లను భారీగా తగ్గించే అవకాశం ఉంది.
ఈ 8 వారాల రూల్ అమలులోకి వస్తే.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు తమ డీల్స్ విషయంలో పునరాలోచనలో పడతాయి. ``ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తే మేము అంత పెద్ద మొత్తంలో ఎందుకు చెల్లించాలి?`` అని ఓటీటీ సంస్థలు ప్రశ్నించవచ్చు. ఇది నిర్మాతలకు పెద్ద దెబ్బ అవుతుంది. మరోవైపు ఎగ్జిబిటర్లు ప్రవేశపెట్టాలని చూస్తున్న `పర్సంటేజ్ సిస్టమ్` వల్ల కూడా నిర్మాతలు రిస్క్‌లో పడే అవకాశం ఉంది. సినిమా బాగా ఆడితే ఇద్దరికీ లాభమే కానీ ఫ్లాప్ అయితే మాత్రం థియేటర్ల నిర్వహణ ఖర్చులను కూడా నిర్మాతలు భరించాల్సి రావచ్చు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్ బాబు, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు థియేటర్ల మనుగడ ముఖ్యం అని భావిస్తున్నాకానీ.. చిన్న, మధ్యతరహా చిత్రాల నిర్మాతలు మాత్రం ఓటీటీ ఆదాయం కోల్పోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఓటీటీ సంస్థలు ఇచ్చే ప్రీమియం రేట్లు తగ్గుతాయని, ఇది సినిమా బడ్జెట్లపై ప్రభావం చూపుతుందని వారు వాదిస్తున్నారు. ఒకవేళ నిర్మాతలు ఈ నిబంధనకు కట్టుబడకపోతే ఎగ్జిబిటర్లు ఆ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించబోమని హెచ్చరించే అవకాశం ఉంది.
మొత్తానికి `8 వారాల విండో` అనేది కేవలం ఒక నిబంధన మాత్రమే కాదు. ఇది థియేటర్ల మనుగడకు ..ఓటీటీ ఆదాయానికి మధ్య జరుగుతున్న పెద్ద యుద్ధం. ఒకవేళ నిర్మాతలు ఈ నిబంధనకు లోబడితే ఓటీటీ డీల్స్ విలువ ఎంతవరకు తగ్గుతుంది? ఓటీటీ సంస్థలు తమ పేమెంట్స్ స్ట్రక్చర్‌ను ఎలా మారుస్తాయి? అనేవి ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సందిగ్ధతకు తెరపడాలంటే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్లు కలిసి కూర్చుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.