ఆ హిట్ సినిమా బాటలోనే టాక్సిక్.. అదే స్ట్రాటజీ రిపీట్?
ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలంటే అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్లకు వచ్చి చూసేలా ఉండేది.
ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలంటే అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్లకు వచ్చి చూసేలా ఉండేది. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడమే సక్సెస్ కు కీలకమనే అభిప్రాయం కూడా బలంగా ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్ లో ఆ ఈక్వేషన్ క్రమంగా మారుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేయడం కంటే, ఒక నిర్దిష్ట వర్గాన్ని స్ట్రాంగ్ గా ఎట్రాక్ట్ చేసి భారీ కలెక్షన్లు సాధించవచ్చనే కొత్త ధోరణి మేకర్స్ లో కనిపిస్తోంది. అదే దారిలో యష్ టాక్సిక్ కూడా అడుగులు వేస్తోందనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
టాక్సిక్ నుంచి ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌ను పరిశీలిస్తే, ఈ సినిమా తన టోన్‌ను మొదటి నుంచే చాలా క్లియర్ గా చూపించుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తోంది. రొమాన్స్, హింస, డార్క్ విజువల్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన టీజర్లు, పోస్టర్లు సాధారణ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే భావనకు పూర్తిగా భిన్నమైన ఇమేజ్‌ను క్రియేట్ చేశాయి. కాంట్రవర్సీకి దారితీసే అంశాలను దాచిపెట్టకుండా, వాటినే ప్రమోషన్ లో భాగంగా మార్చుకోవడం మేకర్స్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ చూడగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చే సినిమా యానిమల్. ఆ సినిమాకు కూడా బోల్డ్ కంటెంట్, అడల్ట్ ట్రీట్‌మెంట్ కారణంగా సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చినప్పటికీ, రిలీజ్ తర్వాత అదే అంశాలు ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ఆ సినిమాకు ఎన్ని విమర్శలు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇప్పుడు టాక్సిక్ కూడా అదే ఫార్ములాను నమ్ముతోందా అనే ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయాలనే ప్రయత్నం కనిపించకపోవడం విశేషం. దీన్ని కొందరు ధైర్యమైన నిర్ణయంగా చూస్తే, మరికొందరు పెద్ద రిస్క్‌గా విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ భారీ కలెక్షన్లకు కీలక బలంగా నిలుస్తున్నారు. ఆ వర్గం పూర్తిగా దూరమైతే కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
అయితే మరోవైపు పరిస్థితులు మారుతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. యూత్, మాస్ ఆడియన్స్, ఓవర్సీస్ మార్కెట్‌లో అడల్ట్ యాక్షన్ డ్రామాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విదేశీ మార్కెట్‌లో ఇలాంటి డార్క్ యాక్షన్ సినిమాలకు ఇటీవల మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. అందుకే అన్ని వర్గాల కంటే తమకు నచ్చిన టార్గెటెడ్ ఆడియన్స్‌పైనే టాక్సిక్ పూర్తి దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇక ప్రమోషన్‌లో వివాదాలను కూడా ఒక మార్కెటింగ్ సాధనంగా ఉపయోగించుకోవడం మరో ఆసక్తికర అంశం. సోషల్ మీడియాలో టీజర్లపై జరుగుతున్న డిస్కషన్, బోల్డ్ విజువల్స్‌పై వస్తున్న భిన్నాభిప్రాయాలు సినిమాకు ఎక్స్‌ట్రా హైప్‌నే తీసుకొస్తున్నాయి. విమర్శలైనా, ప్రశంసలైనా సినిమా పేరు ఆడియన్స్ లో వినిపించడం ముఖ్యమనే ధోరణి టాక్సిక్ మేకర్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తంగా చూసుకుంటే టాక్సిక్ ఒక సురక్షితమైన మార్గాన్ని కాకుండా, రిస్క్‌తో కూడిన వ్యూహాన్ని ఎంచుకున్న సినిమా అనే అభిప్రాయం బలపడుతోంది. ఈ ప్రయోగం యానిమల్ తరహాలో బాక్సాఫీస్ సంచలనంగా మారుతుందా? లేక ఫ్యామిలీ ఆడియన్స్‌ను కోల్పోయిన ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై పడుతుందా? అన్నది రిలీజ్ తర్వాతే తేలనుంది. ఏదేమైనా రిలీజ్ కు ముందే ఈ సినిమా చుట్టూ పెద్ద డిస్కషన్ ను సృష్టించడంలో మాత్రం మేకర్స్ ఇప్పటికే విజయం సాధించారని చెప్పడంలో సందేహం లేదు.