ట్రెండీ స్టోరి: 'భరణం' కోరని స్ఫూర్తి ప్ర‌దాత‌లు ఈ నాయికలు

బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ కూడా ఈ విషయంలో ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ నుండి విడిపోయేటప్పుడు ఆమె భరణం తీసుకోలేదు.;

Update: 2026-03-12 04:11 GMT

సినిమా రంగంలో సెలబ్రిటీల వివాహాలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో.. విడాకులు కూడా అంతే చర్చనీయాంశమవుతుంటాయి. ముఖ్యంగా విడాకుల సమయంలో భరణం రూపంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయనే ప్రచారం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అయితే గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా డబ్బు కంటే ఆత్మగౌరవమే మిన్న అని చాటిచెప్పిన కొందరు కథానాయికలు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది సీనియర్ నటి `రేవతి`. తన భర్త సురేష్ మీనన్ నుండి విడిపోయే సమయంలో ఈ వెట‌ర‌న్ స్టార్ ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఆశించలేదు. పరస్పర అంగీకారంతో గౌరవప్రదంగా విడిపోవడమే ముఖ్యమని రేవ‌తి భావించారు. విడాకులు అనేవి ఒక బంధానికి ముగింపు మాత్రమే తప్ప.. అవి ఆర్థిక లావాదేవీ కాకూడదని రేవతి తన ప్రవర్తన ద్వారా నిరూపించి హుందాతనాన్ని చాటుకున్నారు.

బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ కూడా ఈ విషయంలో ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ నుండి విడిపోయేటప్పుడు ఆమె భరణం తీసుకోలేదు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతత ముఖ్యం తప్ప డబ్బు కాదని ఆమె తన నిర్ణయంతో స్పష్టం చేశారు. స్వతంత్ర భావాలు కలిగిన మహిళగా కల్కి కొచ్లిన్ తీసుకున్న ఈ నిర్ణయం బాలీవుడ్‌లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

అక్కినేని నాగచైతన్యతో విడాకుల సమయంలో సమంతకు భారీ మొత్తంలో భరణం ఆఫర్ వచ్చినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ సమంత దీనిని సున్నితంగా తిరస్కరించార‌నే చ‌ర్చా సాగింది. తన స్వశక్తితో సంపాదించుకోగలననే నమ్మకంతో భర్త ఆస్తిపై ఆశపడని నైజంపై ప్ర‌శంస‌లు కురిసాయి.

ఇక ఇటీవల హన్షిక మోత్వానీ కి సంబంధించిన వార్తలు కూడా ఇదే కోవలో నిలుస్తున్నాయి. విడాకుల సమయంలో భరణం ఆశించకుండా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న కథానాయికల జాబితాలో హ‌న్షిక‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. డబ్బు కంటే తన వ్యక్తిత్వానికే ఈ బ్యూటీ పెద్దపీట వేశారు. భ‌ర్త సోహెయిల్ క‌తూరియా నుంచి విడిపోయేందుకు పిటిష‌న్ వేసిన హ‌న్షిక దానిలో `భ‌ర‌ణం` అడ‌గ‌క‌పోవ‌డంపై మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇలాంటి నిర్ణయాలు నేటి తరం నటీమణుల ఆర్థిక స్వావలంబనకు, వారు సమాజంలో ఆశిస్తున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

నేటి తరం నటీమణులు కేవలం తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ ఎంతో దృఢంగా ఉంటున్నారు. విడాకులు అంటే వందల కోట్ల భరణం అనే పాత అంచనాలను పటాపంచలు చేస్తూ కేవలం ఆత్మగౌరవం, హుందాతనంతో విడిపోతున్నారు. డబ్బు కంటే మానసిక ప్రశాంతతే మిన్న అని భావించే ఇలాంటి నటీమణులు, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకునే ప్రతి మహిళకు స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News