ట్రెండీ టాక్‌: గిల్డ్ నిర్మాత‌లు పుట్ట‌గొడుగులా!?

Update: 2019-07-02 01:30 GMT
టాలీవుడ్ శాస‌న‌క‌ర్త‌లైన నిర్మాత‌ల్లో అస‌లేం జ‌రుగుతోంది? ప‌రిశ్ర‌మ‌లో రెండు నిర్మాత‌ల సంఘాలు ఎందుకు? ఆ రెండిటిలో యాక్టివ్ సంఘం ఏది? ప‌్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ యావ‌త్తూ సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. ఆదివారం నాడు తెలుగు సినిమా నిర్మాత‌ల సంఘం (టీఎఫ్ పీసీ) ఎన్నిక‌ల్లో కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకున్న అనంత‌రం ఛాంబ‌ర్ లో సాగిన ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ ఇది. టాలీవుడ్ నిర్మాత‌ల్ని ఇప్పుడు రెండు కోణాల్లో చూడాల్సిన ప‌రిణామం క‌నిపిస్తోంది. ``ఒక‌టి సినిమాలు తీసేవాళ్లు.. రెండు సినిమాలు తీయ‌ని వాళ్లు``. సినిమాలు తీసేవాళ్ల‌కు అన్నిటా ప్రాధాన్య‌త‌ను క‌ల్పించి తీయ‌ని వాళ్ల పెత్త‌నం త‌గ్గించ‌డం ఆవ‌శ్య‌కం అన్న చ‌ర్చా సాగుతోంది. 

జ‌మానా కాలంలో సినిమాలు తీసి ఇంకా నిర్మాత‌లం అని చెప్పుకునేవాళ్ల‌తో ప‌రిశ్ర‌మ‌కు పెను ముప్పు పొంచి ఉంది. నిర్మాత‌ల మండ‌లి కుప్ప‌కూలేంత సంక్లిష్ట స‌న్నివేశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఇది రాజ‌కీయాల‌కు అతీత‌మైన‌ది. ఒక ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ‌కు సంబంధించిన‌ది. సంక్షేమ‌ ఫ‌లాలు అనుభ‌వించే వాళ్లతో మండ‌లి నిధి దారుణంగా క‌రిగిపోతోంది. దీని వ‌ల్ల టాలీవుడ్ కి ముప్పు ఉంద‌నేది ప‌లువురు నిర్మాత‌ల ఆరోప‌ణ‌. అందుకే వాళ్ల‌ను వెలివేస్తూ 50 మంది యాక్టివ్ నిర్మాత‌లు సొంత కుంప‌టి పెట్టుకున్నారు. ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ పేరుతో కొత్త సంఘం యాక్టివ్ అయ్యింది. అంతేకాదు నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు అంటూ పెద్ద‌రికం నెరిపిన సి.క‌ళ్యాణ్ కి గిల్డ్ వాళ్లు ఎవ‌రూ స‌పోర్ట్ కూడా ఇవ్వ‌లేదు. వీళ్ల‌లో చాలామంది అస‌లు ఎల‌క్ష‌న్ జ‌రిగే చోటికే రాలేదు. ఓటు వేయ‌కుండా లైట్ తీస్కున్నారు. దీంతో కొత్త‌గా ఎన్నికైన‌ అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్ ఎల‌క్ష‌న్ అనంత‌రం మీడియా ముఖంగానే ఓటు వేయ‌ని వాళ్ల‌పై నిప్పులు చెరిగారు.

అస‌లు నిర్మాత‌ల‌కు రెండు అసోసియేష‌న్లు ఎందుకు? ఇలా పుట్టుకొచ్చే పుట్ట‌గొడుగులు నిల‌బ‌డ‌వు!! అని కొత్త అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్ తీవ్రంగానే వ్యాఖ్యానించారు. కౌన్సిల్ సంక్లిష్ట ప‌రిస్థితిలో ఉంద‌ని ఆవేద‌నను.. ఆందోళ‌న‌ను ఆయ‌న‌ క‌న‌బ‌రిచారు. అయితే గిల్డ్ నిర్మాత‌ల పేరెత్త‌కుండానే మండ‌లితో క‌ల‌వ‌ని వారిపైనా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. వీళ్లంతా నిర్మాత‌ల మండ‌లి స‌భ్యులు అయ్యాకే ఎదిగిన వార‌ని.. ఇప్పుడు బ‌య‌ట‌కు వెళ్లి సొంత కుంప‌టి పెట్టుకున్నార‌ని .. అలా చేస్తామంటే కుద‌ర‌ద‌ని గిల్డ్ పైనా హుకుం జారీ చేశారు. అయితే గిల్డ్ నిర్మాత‌లు త‌మ‌తో క‌లుస్తామంటే కాద‌న‌మ‌ని.. వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని సి.క‌ళ్యాణ్ అన్నారు. ఒకే తాటిపై ఉంటేనే సుఖం! మాతో క‌లిసి రావాల‌ని కోరుతూ నిర్మాత‌ల గిల్డ్ కి లేఖ రాస్తామ‌ని సి.క‌ళ్యాణ్ మీడియా స‌మ‌క్షంలో అన్నారు. అంతేకాదు నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా గెలిచిన త‌న‌కు మెగాస్టార్ చిరంజీవి అండ‌గా నిలుస్తామ‌ని మాటిచ్చార‌ని తెలిపారు. సేమ్ టైమ్ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి వారు అసోసియేష‌న్లు పెట్టుకుని యాడ్లు.. ట్రైల‌ర్ల‌ను దొడ్డి దారిన వ్యాపారం చేస్తామంటే స‌హించేది లేద‌ని ఆయ‌న సూటిగానే గిల్డ్ నిర్మాత‌ల‌ తీరును ఎండ‌గ‌ట్టారు. ఓవైపు క‌లుపుకుంటామంటూనే చుర‌క‌లు అంటించే ప్ర‌య‌త్నం చేశారు. గిల్డ్ పేరెత్త‌కుండానే ``పుట్ట‌గొడుగులు`` అంటూ కాస్తంత క‌టువైన వ్యాఖ్య‌లే చేయ‌డం వేడెక్కించింది. ఆయ‌న వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్ధేశించి?  పుట్ట‌గొడుగులు అంటే ఎవ‌రు? ఆ 50 మంది గిల్డ్ నిర్మాత‌ల‌కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వ‌డ‌మేన‌ని అంతా భావిస్తున్నారు.

అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యాక సి.క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం గిల్డ్ నిర్మాత‌లంగా గ‌రంగ‌రంగా ఉన్నార‌ని తెలుస్తోంది. పుట్ట‌గొడుగులు అని త‌మ‌నే అన్నారా? అంటూ గిల్డ్ స‌భ్యుల మ‌ధ్య చ‌ర్చ సాగింద‌ట‌. దీనిని బ‌ట్టి నిర్మాత‌ల మండ‌లి  వేరుకుంప‌టి స‌మ‌స్య చిన్న‌ది అనుకోవ‌డానికి లేదు. ఇది పైకి క‌నిపించ‌నంత సాధా సీదా స‌మ‌స్య కానే కాద‌ని ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ సాగుతోంది. మండ‌లిలో 16కోట్ల మేర నిధి ఉండేదని ఇదివ‌ర‌కూ చ‌ర్చ సాగింది. ఆ నిధి మొత్తం సంక్షేమ కార్య‌క్ర‌మాల పేరుతో ఎటో వెళ్లిపోతోంది. మొత్తం క‌రిగిపోతోంది. మండ‌లి నిధి క‌రిగిపోతోంద‌ని ప‌లువురు నిర్మాత‌లు అన‌డం చ‌ర్చ‌కొచ్చింది.

తాజా స‌మ‌స్యపై ఓ సినీపెద్ద‌ మాట్లాడుతూ.. దీనికి ప‌రిష్కారం వెత‌క‌డం అంత సులువు కాద‌ని అన్నారు. అస‌లు సినిమాలు తీయ‌కుండా నాట‌కాలాడే వాళ్ల‌కు మండలిలో చోటు ఉండ‌కూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ మేర‌కు మండ‌లి బై లాస్ ని కూడా మార్చాల‌ని సూచిస్తున్నారు. ఏడాదిలో ఎన్ని సినిమాలు తీశారు? ఎన్ని తీయ‌బోతున్నారు?! అన్న‌దానిని ప్రాతిప‌దిక‌గా తీసుకుని నిర్మాత‌ల‌కు గ్రేడింగ్ ఇవ్వాల‌ని.. సౌక‌ర్యాలు వ‌ర్తింపజేయాల‌ని.. సినిమాలు తీసేవాళ్ల వ‌ల్ల‌నే ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందుతుంద‌ని.. ఉపాధి మెరుగ‌వుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కేవ‌లం నిర్మాత‌ల మండ‌లి ఫ‌లాల్ని ఎంజాయ్ చేసేందుకు మాత్రమే మండ‌లిలో తిష్ఠ వేసుకుని కూచుంటే కుద‌ర‌ద‌ని నిర్మాత‌ల్లోనే ఎన్నిక‌ల వేళ చ‌ర్చ సాగ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. అస‌లు నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుందా? అన్న చ‌ర్చా ప్ర‌స్తుతం సాగుతోంది. అస‌లు ఏ సినిమాలు తీయ‌కుండానే పెత్త‌నం చేసే నిర్మాత‌లు.. టీవీ చానెళ్ల‌కెక్కి డిబేట్ల తో ప‌బ్బం గ‌డిపేవాళ్లు ఎక్కువైపోయారన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.


Tags:    

Similar News