బాలయ్య తగ్గట్లేదుగా..!

Update: 2019-08-30 07:35 GMT
బాలకృష్ణ ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించి నటించిన 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ నిరాశ పర్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రభావం నుండి వెంటనే బయటపడ్డ బాలయ్య ప్రస్తుతం తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తన 105వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఎన్నికల కారణంగా సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక బాలయ్య తన 106వ చిత్రం విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నాడు.

చాలా కాలంగా బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో చిత్రం గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో మూవీ కంటే ముందే బోయపాటితో బాలయ్య సినిమా చేయాల్సి ఉన్నా కూడా అది ఆలస్యం అవుతూ వస్తుంది. వినయ విధేయ రామ చిత్రం ఫలితం నేపథ్యంలో బోయపాటికి బాలయ్య దూరంగా ఉంటున్నాడనే టాక్‌ కూడా నడిచింది. వీరిద్దరి కాంబోలో మూవీ అనుమానమే అనుకుంటున్న సమయంలలో సినిమాను వచ్చే నవంబర్‌ లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వీరిద్దరి కాంబో మూవీని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించబోతున్నాడు. ఈయన గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రంను నిర్మించాడు. ఇటీవలే ఈ చిత్రంకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి. నవంబర్‌ నుండి షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా దసరాకు సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో బోయపాటి ఉన్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. మరోసారి వీరి కాంబోలో సూపర్‌ హిట్‌ నమోదు అయ్యేనో చూడాలి.
Tags:    

Similar News